కేరళలో లెఫ్టినెంట్ కల్నల్‌పై దాడి వీడియో వైరల్ : రాజీవ్ చంద్రశేఖర్ సీరియస్
కొచ్చిలోని ఎన్‌సిసి క్యాంపులో జరిగిన ఘటన సీరియస్ అవుతోంది. లెప్టినెంట్ కల్నల్ పై కొందరు వ్యక్తులు దాడిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు.
కొచ్చి: కేరళ రాష్ట్రంలో ఓ ఆర్మి అధికారిపై దాడి సంచలనంగా మారింది. కొచ్చిలో ఓ ఎన్‌సిసి క్యాంపులో ఈ ఘటన జరిగింది. ఎన్‌సిసి క్యాడెట్లకు పెట్టే అహారం బాగాలేదని... ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఆరోపణల నేపథ్యంలో వివాదం తలెత్తింది. కొందరు ఎన్‌సిసి క్యాంపువద్దకు వచ్చి నానా భీభత్సం సృష్టించారు... లెప్టినెంట్ కల్నల్ పై భౌతికదాడికి దిగారు.
ఆర్మి అధికారిపై ఇలా అవమానకరంగా దాడిచేయడం వివాదాస్పదంగా మారింది. ఓ పోలీస్ అధికారి ఎదుటే దుండగులు అదికారిపై దాడి చేస్తున్నారు. లెప్టినెంట్ కల్నల్ ను బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు.
అయితే ఇలా ఆర్మి అధికారిపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లెప్టినెంట్ కల్నల్ తో దుండగులు వ్యవహరించిన తీరు అభ్యంతరకమని... వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. కేరళలో ఇలాంటి ఘటనలు ఇంకా చాలా జరుగుతున్నాయని... ఓ వర్గం ఆగడాలు మరీ మితిమీరిపోయాయనే ఆరోపిస్తున్నారు.
లెప్టినెంట్ కల్నల్ పై దాడి వీడియో మాజీ మంత్రి మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నేత రాజీవ్ చంద్రశేఖర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఎక్స్ వేదికన రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసారు. '' ముఖ్యమంత్రి పినరయి విజయన్... మీరు శాంతిభద్రతలు పరిరక్షిస్తూ, చట్టాలను అమలుచేయడంలో విఫలమయ్యారు... యూనిఫాంలో వున్నవారికే రక్షణ లేకుంటే ఎలా. ఈ ఘటనకు బాధ్యతవహిస్తూ మీరు వెంటనే రాజీనామా చేయాలి''అని డిమాండ్ చేసారు.
''లెప్టినెంట్ కల్నల్ పై దాడి సిగ్గుచేటు. ఈ ఘటన సీఎం నుండి హోంమంత్రి, స్థానిక పోలీసుల వైఫల్యాన్ని తెలియజేస్తుంది. హమాస్ వాళ్లకు కేరళలో రెడ్ కార్పెట్ స్వాగతం వుంటుంది. కానీ దేశసేవ చేసేవారు, గతంలో కేరళలో ప్రకృతివిపత్తు సంభవించిన సమయంలో ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు చేపట్టిన ఆర్మివారిపై మాత్రం దాడులు సిగ్గుచేటు. లెప్టినెంట్ కల్నల్ పై దాడిచేసిన దుండగులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే నేనే స్వయంగా కోర్టుకు వెళ్లి న్యాయం జరిగేలా చూస్తా. ఈ వ్యవహారాన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. దాడిచేసిన దుండగులకు కఠిన శిక్ష విధించేవరకు పోరాడతా'' అని రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరించారు.