హైదరాబాద్: తిరుచ్చి లలిత జ్యువెలరీ చోరీ కేసులో సూత్రధారి తిరువరూరు బాల మురుగన్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తొలుత సినిమా తారల వాహనాలకు డ్రైవర్ గా పనిచేసిన మురుగన్ సినీ రంగంలోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరాడు. దాంతో నిర్మాతగా మారడానికి బ్యాంక్ చోరీలకు శ్రీకారం చుట్టాడు. 

తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డాడు. గతంలో హైదరాబాదు శివారులో సైబరాబాద్ పోలీసులకు చిక్కినట్లే చిక్కి ముప్పు తిప్పలు పెట్టి తప్పించుకున్నాడు. చోరీలు చేసిన డబ్బుతో తన మేనల్లుడు సురేష్ హీరోగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీవీ నటి హీరోయిన్ గా మనసా వినవే అనే సినిమాను ప్రారంభించాడు. 

రాజమండ్రి సమీపంలో కొంత కాలం షూటింగ్ కూడా జరిపాడు. ఈ సినిమాకు క్లాప్ కొట్టేందుకు వచ్చిన డీఎస్పీ బంధువును ప్రొడక్షన్ మేనేజర్ గా నియమించుకున్నాడు. దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు చేశాడు, ఆ తర్వాత డబ్బులు లేక ఆపేశాడు. 

మురుగన్ కు చదువు రాదు. కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వాడుకునేవాడు. గూగుల్ సెర్చ్ లో వెతికి నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులను ఎంచుకునేవాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకు చోరీలన్నీ సెలవు రోజుల్లోనే చేశాడు. చోరీ చేయడానికి వచ్చిన బ్యాంకుల్లో తాపీగా విశ్రాంతి తీసుకునేవాడు. 

మురుగన్ 2011లో ఓసారి పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత కొంత కాలం తిరువన్నూరులో బినామీ పేరుతో స్థిరాస్తి వ్యాపారం చేశాడు. దోచుకున్న సొత్తులో 4 నుంచి 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఆ బినామీ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తుండగా అతను మరణించాడు. 

దోచిన సొమ్ముతో మురుగన్ హైదరాబాదు సమీపంలోని శంషాబాద్ సమీపంలో ఓ ఇల్లు, ఖాళీ స్థలం కొన్నట్లు తెలియడంతో పోలీసులు 2015లో కొన్నాళ్లు పోలీసులు అక్కడ నిఘా పెట్టారు. ఇది గమనించి అతను పారిపోయాడు. దాంతో పోలీసులు ఇంట్లో దొరికిన సొమ్మును, స్థిరాస్తిని జప్తు చేశారు. 

ఆ సమయంలో మహాబలిపురంలో తలదాచుకున్నట్లు తెలియడంతో అక్కడికి కూడా వెళ్లారు. పోలీసుల రాకను పసిగట్టి అక్కడి నుంచి తప్పించుకున్నిాడు. పిల్లలు పుట్టడం లేదంటూ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇస్తుందనే అనుమానంతో రెండో భార్యను వదిలేశాడు. 

హైదరాబాదులో ఉన్నప్పుడే లక్షన్నర రూపాయలు ఇచ్చి ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. వందలాది మంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని రోగాల పాలైనట్లు చెబుతున్నారు.