రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఆర్నబ్‌ గోస్వామికి బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీం కోర్టుపై పోలిటికల్‌ కామెంటర్‌, ప్రముఖ కమెడియన్‌ కునాల్‌ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దేశ అత్యున్న న్నాయస్థానంపై వ్యంగ్యాస్త్రాలు సంధించి చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నాడు. ఇంత జరుగుతున్నా కమ్రా తన వ్యాఖ్యాలను వెనకకు తీసుకోబోనని, క్షమాపణలు చేప్పేది లేదంటూ ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశాడు.

శుక్రవారం కుమ్రా ట్వీట్‌ చేస్తూ ‘న్యాయవాదులు లేరు, క్షమాపణలు లేవు, జరిమానా లేదు’ అని చేతులు జోడించి ఉన్న ఎమోజీలను జత చేశాడు. దీంతో అత్యున్నత న్యాయస్థానంపై అతడు చేసిన వ్యాఖ్యలకు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎనిమిది మంది న్యాయవాదులు కమ్రాను కోర్టులో హాజరుపరచడానికి అతడిపై కోర్టు ధిక్కారణ కేసుకు అనుమితివ్వాల్సిందిగా అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను కోరారు. దీనికి అంగీకరించిన ఆయన.. సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసి కమ్రా తన హద్దులు దాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమ్రా సుప్రీంకోర్టుని విమర్శిస్తూ చేసిన ట్వీట్‌లు కోర్టుని అవహేళన చేయడమేనని, అతనిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తున్నట్లు అటార్నీ జనరల్‌(ఏజీ) వేణుగోపాల్‌ తెలిపారు.

సుప్రీంకోర్టుని, న్యాయమూర్తులను ప్రజలు ధైర్యంగా, బహిరంగంగా విమర్శించవచ్చునని, అయితే వాక్‌ స్వాతంత్య్రం అనేది చట్టానికి లోబడి ఉంటుందని కెకె.వేణుగోపాల్‌ అన్నారు.

లోగడ ముంబై నుంచి లక్నోకు  ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న అర్నాబ్ గోస్వామి పట్ల కునాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో 5 ఎయిర్ లైన్స్ ఈయనను బ్యాన్ చేశాయి.