ఇప్పటి వరకు చికెన్ కూర వండలేదనో, లేదంటే అందులో కారం ఎక్కువైందని, ఉప్పు ఎక్కువైందని భార్యలను కడతేర్చిన ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా భోజనానికి సంబంధించిన విషయంలో ఓ ఆడపడుచు వదిన ప్రాణాలు తీసింది.

వివరాల్లోకి వెళితే.. కోల్‌కతా డల్హౌసీ ప్రాంతానికి చెందిన ఫాల్గుణి బసు సోమవారం రోజు ఆడపడుచు కుమారుడికి బిర్యానీ చేసి పెట్టింది. అయితే కొద్దిసేపటి తర్వాత అతడికి వాంతులు కావటం మొదలుపెట్టాయి.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆడపడుచు శర్మిష్ట బసు (40) ఫాల్గుణి తన కుమారుడికి చద్ది బిర్యానీ పెట్టడం వల్లే అస్వస్థతకు గురయ్యాడని మండిపడింది. అంతే కోపంతో ఊగిపోయిన ఆమె.. వదినపై దాడికి దిగి విచక్షణా రహితంగా కొట్టింది.

దెబ్బల కారణంగా ఫాల్గుణి గట్టిగా కేకలు పెట్టడంతో.. గుండెపోటు వచ్చి, నేలపై కుప్పకూలిపోయింది. ఆమె అరుపులు విని అక్కడికి పరిగెత్తుకొచ్చిన భర్త నేలపై పడిఉన్న భార్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు.

ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితురాలు స్క్రిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతోందని, తరుచూ వింతగా ప్రవర్తిస్తోందని కుటుంబసభ్యులు వెల్లడించారు.