కేరళకు చెందిన ఓ మహిళ మూడు నెలల్లో 350 కోర్సులు పూర్తిచేసి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. లాక్ డౌన్ కాలాన్ని ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుంది. మార్చి 22న లాక్ డౌన్ ప్రకటించగానే కేరళకు చెందిన ఆరతీ రఘునాధ్ టైం వేస్ట్ చేయకూడదనుకుంది. అంతే Coursera అనే వెబ్ సైట్ నుంచి ప్రపంచంలోని పలు యూనివర్సిటీలు అందించే ఆన్‌లైన్‌ కోర్సులకు అడ్మిషన్లు తీసుకుంది. అలా 90 రోజుల్లో 350 కోర్సులు కంప్లీట్ చేసింది. 

కొచ్చిలోని ఎలమక్కర ప్రాంతానికి చెందిన ఆరతీ రఘునాధ్ స్థానిక ఎం.ఈ.ఎస్ కాలేజీలో ఎంఎస్‌సీ బయో కెమిస్ట్రీ చదువుతోంది. లాక్ డౌన్ లో అందరూ సరదాగా గడిపితే ఆరతి మాత్రం క్షణం వృధా చేయలేదు. 

జాన్ హాకిన్స్ యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ డెన్మార్క్ వర్జీనియా యూనివర్సిటీ, స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ, కోపెన్‌హాగన్ యూనివర్సిటీ, రోచెస్టర్ యూనివర్సిటీ, ఎమోరీ యూనివర్సిటీలు కోర్సెరా ప్రాజెక్ట్ నెట్‌వర్క్ ద్వారా అందించిన కోర్సులను ఆరతీ లాక్‌డౌన్ సమయంలో కంప్లీట్ చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.

ఆన్‌లైన్ కోర్సుల ప్రపంచానికి నన్ను నా కాలేజీ అధ్యాపకులే పరిచయం చేశారు. ఆన్‌లైన్‌లో అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడూ పాఠ్యాంశాల్లో మారుతూ ఉంటాయి. మా కాలేజ్ ప్రిన్సిపాల్ అజిమ్స్ పి ముహమ్మద్, లెక్చరర్ల సాయంతో కొన్ని వారాల్లోనే నేను సైన్ అప్ చేసిన కోర్సులను కొన్ని వారాల్లో పూర్తి చేయగలిగానని ఆరతి చెబుతోంది.