కిడ్నాప్‌కు గురై మతం మార్చి ఉగ్రవాదంవైపుగా వెళ్లిందని ప్రచారం జరుగుతున్న కేరళ యువతి మీడియా ముందుకు వచ్చారు. ప్రేమించిన వ్యక్తి కోసం తాను అబుదాబి వెళ్లానని తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే..  కోజికోడ్‌కు చెందిన 19 ఏళ్ల అయేషా అనే యువతి ఢిల్లీలోని జీసస్ అండ్ మేరి కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఆమె ఈ నెల 18 నుంచి అయేషా ఒక్కసారిగా కనిపించకుండా పోయారు.

దీంతో కంగారుపడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయేషా అబుదాబి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఆమెను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చి, ఉగ్రవాదంలో చేర్చారనే ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో అయేషా మీడియా ముందుకు వచ్చి పుకార్లను ఖండించారు. అబుదాబిలో స్థిరపడిన భారత సంతతి వ్యక్తితో 9 నెలల క్రితం తనకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిందని.. అది ప్రేమగా మారి, అతనిని పెళ్లి చేసుకునేందుకు అబుదాబి వెళ్లానన్నారు.

తన ఇష్టపూర్వకంగానే ఇస్లాంలోకి మారానని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదన్నారు. తాను మేజర్‌నని .. తన జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా తీసుకునే హక్కు తనకు ఉందని అయేషా స్పష్టం చేశారు.

ఇదే విషయాన్ని అబుదాబి కోర్టుకు సైతం తెలిపానని.. తన కుటుంబసభ్యులు కూడా అబుదాబికి వస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తనకు భారత్ వచ్చే ఉద్దేశ్యం లేదని.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అబుదాబిలోనే స్థిరపడతానని ఆమె స్పష్టం చేశారు.