దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తనపై లైంగిక దాడి ఆరోపణలను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తోసిపుచ్చింది. మీ పిటిషన్ ఏ మాత్రం విచారణార్హంగా లేదని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు.

అయితే తనను ఈ కేసులో కావాలని ఇరికించారని, తాను అమాయకుడినంటూ బిషప్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకుముందు ములక్కల్ అభ్యర్థనను కేరళ హైకోర్టుతో పాటు ప్రత్యేక న్యాయస్థానం సైతం తోసిపుచ్చుతూ విచారణను ఎదుర్కోవాలని ఆదేశించాయి.

ఇక 2014 నుంచి 2016 మధ్య బిషప్ ములక్కల్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని 2018 జూన్‌లో 43 ఏళ్ల నన్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను 2018 సెప్టెంబర్‌లో ఆయనను అరెస్ట్ చేశారు.

40 రోజుల అనంతరం ములక్కల్ బెయిల్‌పై విడుదలయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగుచూడటంతో జలంధర్ బిషప్‌గా ములక్కల్‌ను తొలగించారు. ఆయనపై సిట్ చార్జిషీట్‌ను దాఖలు చేసింది.