Asianet News TeluguAsianet News Telugu

కేరళ ఉగ్రవాదానికి హాట్‌స్పాట్.. ప్రజలకు రక్షణ లేదు: బీజేపీ చీఫ్ నడ్డా తీవ్ర ఆరోపణలు

కేరళ ఉగ్రవాదానికి హాట్ స్పాట్ అయిందని, ఇక్కడ మత పరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. హింసను పెంచిపోషిస్తున్నవారికి రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం పరోక్ష మద్దతు ఇస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు భద్రత కరువైందని పేర్కొన్నారు.
 

kerala is hot spot to terrorism alleges bjp chief jp nadda
Author
First Published Sep 26, 2022, 9:59 PM IST

తిరువనంతపురం: కేరళ ఇప్పుడు ఉగ్రవాదానికి హాట్ స్పాట్ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వివరించారు. తిరువనంతపురంలో సోమవారం ఆయన కేరళలోని వామపక్ష ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.

సీఎం పినరయి విజయన్ పైనా ఆయన మాటలతో దాడి చేశారు. ప్రభుత్వ విషయాల్లో సీఎం కుటుంబ సభ్యుల జోక్యం కూడా పెరుగుతున్నదని ఆరోపించారు. వంశపాలన పార్టీల దారిలోనే వామపక్ష పార్టీ కూడా పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాల్లో సీఎం కూతురు, అల్లుడి ప్రమేయం కనిపిస్తున్నదని ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుతున్నాయని అన్నారు. హింసను సృష్టిస్తున్న, పెంచి పోషిస్తున్న వారికి వామపక్ష ప్రభుత్వం పరోక్షంగా మద్దతు ఇస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ అండదండలతోనే అరాచకం రగులుతున్నదని తెలిపారు. అందుకే బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి ప్రజల వద్దకు వెళ్లి కేరళలోని పాలన గురించి ప్రజలకు విప్పి చెబుతున్నారని పేర్కొన్నారు. 

‘కేరళ ఇప్పుడు టెర్రరిజానికి హాట్ స్పాట్. విద్రోహ శక్తులకు హాట్ స్పాట్‌గా మారింది. ఇక్కడ ప్రాణాలకు ముప్పు పొంచే ఉన్నది. సామాన్య ప్రజలకు ఇక్కడ భద్రతపై భరోసా సడలింది. మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హింసను పెంచిపోషిస్తున్న వారికి లెఫ్ట్ ప్రభుత్వం పరోక్ష మద్దతు ఇస్తున్నది’ అని ఆయన ఆరోపణలు చేశారు. బూత్ స్థాయి బాధ్యులతో ఆయన సమావేశమై ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తరవ్ాత తిరువనంతపురంలో బీజేపీ జిల్లా కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios