కేరళలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు క్రిస్టియన్ కేవిన్ పీ జోసెఫ్ హత్య కేసులో న్యాయస్థానం  సంచలన తీర్పును వెలువరించింది. ఇది పరువుగా హత్యగా  తేల్చిన కోర్టు... మొత్తం 10 మందిని దోషులుగా నిర్థారించి వీరికి శనివారం శిక్షలు ఖరారు చేయనుంది.

వివరాల్లోకి వెళితే... 2018 మే 24న నీను చాకో అనే యువతిని కేవిన్ కొట్టాయంలో పెళ్లి చేసుకున్నాడు. అయితే కేవిన్ దళితడు కావడంతో ఈ పెళ్లిని.. నీను కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది.

పెళ్లయిన రెండు రోజులకే ఓ గ్యాంగ్ కేవిన్‌ను.. అతని స్నేహితుడు అనీష్‌ను ఎత్తుకెళ్లింది. నీను సోదరుడు స్యాను చాకో వీరి కిడ్నాప్ వెనుక ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అనీష్‌ను సదరు గ్యాంగ్ విడిచిపెట్టినప్పటికీ... ఆ మరునాడు కేవిన్ మృతదేహం కొల్లాం జిల్లాలోని థెన్‌మలా వద్ద కాలువలో దొరికింది.

కేవిన్‌ను బలవంతంగా నీళ్లలో ముంచి చంపినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. అతని కిడ్నాప్‌పై కేవిన్ భార్య నీను, కేవిన్ కుటుంబం పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని విచారణలో వెల్లడైంది.

ఈ హత్య కేసులో స్యాను చాకోతో పాటు మరో పదిమందిని హత్య, అపహరణ, క్రిమినల్ కుట్ర తదితర సెక్షన్ల కింద న్యాయస్ధానం దోషులుగా  నిర్థారించింది. ఇదే సమయంలో నీనూ తండ్రిని, మరో ముగ్గురు నిందితులను ఆధారాలు లేవని న్యాయస్ధానం విడిచిపెట్టింది.