తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కొచ్చి తొప్పంపాడి వంతెన సమీపంలో ఆదివారం నాడు శిక్షణ గ్లైడర్ కూలి ఇద్దరు నౌకాదళ ఉద్యోగులు మరణించారు.

ఐఎన్ఎస్ గరుడ నుండి టేకాఫ్ అయిన కాసేపటికే  శిక్షణ గ్లైడర్ కూలిపోయిందని అధికారులు ప్రకటించారు.  ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించినవారిలో లెఫ్టినెంట్ రాజీవ్  ఝా,  మరొకరిని సునీల్ కుమార్ గా గుర్తించారు. 

సాధారణ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా ఈ గ్లైడర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సదరన్ నావల్ కమాండ్ బోర్డు విచారణకు ఆదేశించింది.

ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించారని వైద్యులు ప్రకటించారు.

ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొనేందుకు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదికను రూపొందించనుంది.ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు అధికారులు.