కాశ్మీర్ కు గాజా, పాలస్తీనా గతే పడుతుంది - ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు..
భారత ప్రభుత్వం (indian government) పాకిస్థాన్ (pakisthan)తో ఎందుకు చర్చలు జరపడం లేదని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah)ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పొరుగు దేశంతో మాట్లాడకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే జమ్మూ కాశ్మీర్ (jammu kashmir)కు వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Farooq Abdullah : జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్ తో చర్చలు జరపకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే పడుతుందని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ తో చర్చలు జరపడం లేదని మండిపడ్డారు.
‘‘మన స్నేహితులను మనం మార్చుకోగలం కానీ పొరుగువారిని కాదని అటల్ బిహారీ వాజ్ పేయి చెప్పేవారు. మనం ఇరుగు పొరుగు దేశాలతో స్నేహంగా ఉంటే ఇద్దరూ పురోగతి సాధిస్తారు. మనం శుత్రత్వంతో ఉంటే ముందుకు సాగలేం. యుద్ధం అనేది ఇప్పుడు ఆప్షన్ కాదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోడీ కూడా అన్నారు. ఇప్పుడు ఆ డైలాగ్ ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను.
‘‘పాకిస్థాన్ లో నవాజ్ షరీఫ్ ప్రధాని కాబోతున్నారు. ఆయన భారత్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అయితే మనం చర్చలకు సిద్ధంగా లేకపోవడానికి కారణం ఏమిటి ? చర్చల ద్వారా దీనిని పరిష్కరించుకోకపోతే, ఈ రోజు ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్న గాజా, పాలస్తీనాల గతినే మనం కూడా ఎదుర్కోవలసి ఉంటుందని నేను చింతిస్తున్నాను. ఏదైనా జరగవచ్చు. మనకు ఏమి జరుగుతుందో అల్లాకు మాత్రమే తెలుసు. అల్లా మనపై దయ చూపుగాక.’’ అని అన్నారు.
గత గురువారం పూంచ్‌లో సైనిక సైనికులపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఇందులో నలుగురు సైనికులు వీర మరణం పొందారు. ఈ ఘటన నేపత్యంలోనే ఫరూక్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. మరోవైపు గాజా విషయంలో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు పాలస్తీనాలో 20 వేల మందికి పైగా మరణించారు.