కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి గుండెపోటుతో మరణించారు. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ప్రైవేటు హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆయనకు గుండె పోటు వచ్చినట్టు తెలిసింది. 

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మంత్రి ఉమేశ్ కత్తి కన్నుమూశారు. డాలర్ కాలనీలో నివసిస్తున్న మంత్రి ఉమేశ్ కత్తికి మంగళ వారం రాత్రి 10 గంటల సమయంలో గుండె నొప్పి వచ్చింది. ఆయనను వెంటనే ఇక్కడి ప్రైవేటు హాస్పిటల్‌ ఎంఎస్ రామయ్య హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్ ఐసీయూలో ఆయనకు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఈ ఐసీయూలోనే ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తున్నది. మంత్రి ఉమేశ్ కత్తి వయసు 61 ఏళ్లు.

బసవరాజు బొమ్మై ప్రభుత్వంలో ఉమేశ్ విశ్వనాథ్ కత్తి ఫుడ్, సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్, ఫారెస్ట్ శాఖల మంత్రిగా సేవలు అందించారు. ఆయన ఆరు సార్లు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన హుక్కేరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

తండ్రి విశ్వనాథ్ కత్తి 1985లో కాలం చేసిన తర్వాత ఉమేశ్ కత్తి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2013లో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. 81 వేలకు పైగా ఓట్లతో ఆయన విజయ పతాకం ఎగరేశారు.