Asianet News TeluguAsianet News Telugu

కేబినెట్‌లో మార్పులు: యడియూరప్ప చర్చలు.. అలకవీడిన శ్రీరాములు

కర్ణాటక కేబినెట్‌లో ఇటీవల చోటు చేసుకున్న మార్పులపై అలకవహించిన బీజేపీ సీనియర్ నేత, మంత్రి బి శ్రీరాములు కాస్త మెత్తబడ్డారు. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను కలిసి మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు

karnataka minister b sriramulu says he is happy with new portfolio
Author
Bangalore, First Published Oct 13, 2020, 5:45 PM IST

కర్ణాటక కేబినెట్‌లో ఇటీవల చోటు చేసుకున్న మార్పులపై అలకవహించిన బీజేపీ సీనియర్ నేత, మంత్రి బి శ్రీరాములు కాస్త మెత్తబడ్డారు. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను కలిసి మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను గతంలో కోరుకున్న శాఖే ఇప్పుడు తనకు దక్కిందని చెప్పారు. ఈ కొత్త బాధ్యతను సంతోషంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవారం తన మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేసిన సంగతి తెలిసిందే. శ్రీరాములు నిర్వహించిన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖను వైద్య విద్యా శాఖ మంత్రి కే సుధాకర్‌కు అప్పగించి, శ్రీరాములుకు సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చారు. 

దీనిని ఊహించని శ్రీరాములు ముఖ్యమంత్రి యడియూరప్పను సోమవారం కలిశారు. అనంతరం రోజంతా తన ఇంటికే పరిమితమయ్యారు. మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే ఆయనను బుజ్జగించాలని భావించిన సీఎం యడియూరప్ప చొరవ తీసుకుని శ్రీరాములును, సుధాకర్‌ను తన నివాసానికి పిలిపించారు. ఇద్దరితోనూ చర్చలు జరిపారు.

అనంతరం శ్రీరాములు, సుధాకర్ కలిసికట్టుగా ముఖ్యమంత్రి నివాసం నుంచి బయటకు వచ్చారు. శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చినపుడు తనకు సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు.

చాలా కారణాల వల్ల తనకు ఆరోగ్య శాఖను ఇచ్చారన్నారు. తన పనితీరును గుర్తించి, ఇప్పుడు తనకు తాను కోరుకున్న సాంఘిక సంక్షేమ శాఖను ఇచ్చారన్నారు. ఈ శాఖను తాను సంతోషంగా నిర్వహిస్తానని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలు, పేదల సంక్షేమం కోసం తాను పని చేయాలని ముఖ్యమంత్రి యడియూరప్ప కోరుకున్నారన్నారు. శ్రీరాములు బీజేపీలో ప్రముఖ షెడ్యూల్డు తెగల నాయకుడు అనే విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios