ప్రజలకు మద్యం డోర్ డెలివరీ చేస్తామంటూ ప్రకటించి ఓ మంత్రి ఇరకాటంలో పడ్డారు. ఓవైపు ప్రజలు వరదలతో సతమతమౌతున్నారు. కనీసం తినడానికి  తిండి కూడా దొరకని స్థితిలో పలువురు ఉన్నారు. వారి కష్టాలు తీర్చాల్సిందిపోయి... మద్యం డోర్ డెలివరీ చేస్తామంటూ ప్రకటించారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అలాంటి సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి నగేష్ చేసిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమౌతోంది. ప్రజల సౌకర్యం కోసం ‘మద్యం డోర్‌ డెలివరీ’ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన గురించి విన్న సీఎం యడియూరప్ప.. మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘అంతా మీ ఇష్టమేనా..? ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు..? అసలు ఈ విషయాలన్నీ మీడియాకు ఎందుకు చెప్పారు’ అంటూ నగేష్‌కు సీఎం క్లాస్ తీసుకున్నారు. మంత్రి చేసిన ఈ ప్రకటన కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అయితే ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి. కచ్చితంగా ఈ విషయాన్ని ప్రతిపక్షాలు రద్దాంతం చేస్తాయని సీఎం యడ్యూరప్ప కంగారుపడుతున్నట్లు తెలుస్తోంది.