కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఆయన తన వ్యక్తిగత సహాయకుడి చెంప చెళ్లుమనిపించారు.

మైసూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సిద్ధూ విమానాశ్రయం వద్ద ఏదో విషయమై కోపంగా ఉన్నారు. ఈ సమయంలో తన వ్యక్తిగత సహాయకుడి చెంప చెళ్లుమనిపించారు.

దీనిని అక్కడేవున్న మీడియా కెమెరాలు క్లిక్ మనిపించడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆయన ఎందుకు ఇలా ప్రవర్తించారో ఇంకా తెలియరాలేదు. సదరు వ్యక్తి ఫోన్‌ను సిద్ధరామయ్య చెవి దగ్గర పెడుతూ అవతలి వ్యక్తితో మాట్లాడమని చెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సిద్ధూ.. అతని వైపు చూసి అందరి ముందు చెంప చెళ్లుమనిపించారు. అనంతరం సహాయకుడిని పక్కకు నెట్టి తన కారు వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు.

కాగా.. సిద్ధూ ఇతరులపై చేయి చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో కేడా ఓ మహిళా కాంగ్రెస్ కార్యకర్తను దూషిస్తూ చేయి చేసుకోవడం అప్పట్లో దుమారాన్ని రేపింది.