బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఎన్సీబీ తన దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రియా చక్రవర్తి అరెస్టు కాగా.. పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు నోటీసులు జారీ చేశారు. కాగా.. ముంబయిలోని పలు చోట్ల సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. 

ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ గుట్టు రట్టు చేసేందుకు దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా కరణ్ జోహార్ సహాయకుడు క్షితిజ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. క్షితిజ్‌ను అధికారులు అరెస్టు చేశారు. కాగా ఇప్పటికే అరస్టయినవారు డ్రగ్స్ వ్యాపారుల 150 మంది పేర్లు వెల్లడించడంతో ఎన్సీబీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. డ్రగ్స్ వ్యవహారంతో టీవీ నటుల ప్రమేయంపైనా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆధారాలు సేకరించింది. 

ఎన్సీబీ సమన్లు అందుకున్న టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతీసింగ్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. నిన్ననే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకున్న రకుల్ ఇవాళ ఉదయం ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లారు. ఆమె స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేయనున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి సేకరించేది.. మాదక ద్రవ్యాలను అందించేవారు ఎవరు? రియాతో ఎలా పరిచయం అయింది.. తదితర ప్రశ్నలకు సమాధానాలను రకుల్ నుంచి అధికారులు రాబట్టనున్నారు