బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బాధ్యతలు కేటాయించారు. ఏపీలో ప్రస్తుతం వున్న వారికే బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఇన్‌ఛార్జ్‌గా మురళీధరన్, సహా ఇన్‌ఛార్జ్‌గా సునీల్ దేవధర్‌ను కొనసాగిస్తూ నడ్డా ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా పురందేశ్వరినీ , తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా తరుణ్ చుగా, యూపీ సహ ఇన్‌ఛార్జ్‌గా సత్యకుమార్‌, మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా మురళీధర్ రావు, కర్నాటక సహ ఇన్‌ఛార్జ్‌గా డీకే అరుణ, తమిళనాడు సహ ఇన్‌ఛార్జ్‌గా పొంగులేటి సుధాకర్ రెడ్డిని నియమించారు.

కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవలే నియమితులైన జగత్ ప్రకాష్ నడ్డా శనివారం తన కొత్త టీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో గత పదేళ్లుగా బీజేపీలో కీలక నేతలుగా చక్రం తిప్పుతున్న రాంమాధవ్, జీవీఎల్‌కు తన కార్యవర్గంలో చోటివ్వకపోవడం చర్చకు దారి తీసింది.

బీజేపీ ఉపాధ్యక్షులుగా 13 మందిని, జాతీయ కార్యదర్శులుగా 13 మందిని, జాతీయ అధికార ప్రతినిధులుగా 23 మంది, ప్రధాన కార్యదర్శులుగా 8 మందికి జేపీ నడ్డా బాధ్యతలు అప్పగించారు.

వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురందేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి, జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్‌కు పదవులు కట్టబెట్టారు. అలాగే ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్‌కు బీజేపీ జాతీయ కార్యదర్శి పదవి దక్కింది.

వాస్తవానికి సునీల్ దియోధర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కాగా, ఏపీ నుంచి ఇద్దరికి మాత్రమే బీజేపీ జాతీయ కమిటీలో స్థానం దక్కింది