తమిళనాడులో జర్నలిస్ట్‌ దారుణ హత్యకు గురయ్యాడు. తమ అక్రమ దందాపై పోలీసులకు సమాచారం ఇచ్చాడనే నెపంతో జర్నలిస్ట్‌ ఇంటికి వెళ్లిన దుండగులు ఆయనను అపహరించి, దారుణంగా హత్య చేశారు.

వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లాకు చెందిన స్రావెల్‌ మోసెస్‌ (27) టీవీ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఓ ముఠా స్థానికంగా ఉన్న సరస్సు చుట్టూ భూమిని ఆక్రమిస్తూ విక్రయిస్తోంది.

అంతేకాకుండా మాదకద్రవ్యాలను సైతం అమ్ముతోంది. దీనిని స్రావెల్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయనను ఈ గ్యాంగ్ టార్గెట్ చేసింది.

ఈ క్రమంలో ఆదివారం స్రావెల్ ఇంటికి వెళ్లిన దుండగులు ఆయనను బయటకు పిలిచి కిడ్నాప్ చేశారు. అనంతరం దారుణంగా హత్యచేశారు.  ఈ హత్య కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే తన ప్రాణాలకు హాని ఉందని తమ కుమారుడు పోలీసులను ఆశ్రయించినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్రావెల్ తండ్రి జ్ఞానరాజ్‌ ఆరోపించారు. కాగా మృతుడి తండ్రి ఆరోపణలను పోలీసులు కొట్టివేశారు.

మోసెస్‌ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తేల్చి చెప్పారు. వ్యక్తిగత కారణాలు, భూమికి సంబంధించిన కారణాలతోనే హత్య జరిగిందని పోలీసులు అన్నారు.  మరోవైపు స్రావెల్ హత్య కేసులో పోలీసుల తీరుపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి.

సోమన్‌గాలమ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి విక్రయాలు, భూదందాపై పోలీసుకు తెలిపిన అనంతరం మోసెస్‌కు బెదిరింపులు ప్రారంభమయ్యాయని సీనియర్ జర్నలిస్ట్ భారతి తమిళన్ అన్నారు.

మృతుడు పోలీసులను సంప్రదించినా వారు పట్టించుకోకపోవడంతోనే ఈ హత్య జరిగిందని... రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎలాంటి భద్రత లేదని ఆయన ఆరోపించారు.