Jitendra Awhad : శ్రీరాముడు మాంసాహారి.. వేటాడి తినేవారు.. - ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. (వీడియో)

రాముడు మాంసాహారి (Lord Ram non-vegetarian) అని ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవద్ (NCP leader Jitendra Awhad) అన్నారు. ఆయన వేటాడి తినేవారని చెప్పారు. 14 ఏళ్లు అడవిలో ఉన్న వ్యక్తి శాఖాహారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. రాముడు క్షత్రియుడు అని, క్షత్రియులు మాంసాహారులు అని తెలిపారు.

Jitendra Awhad: Lord Ram is a carnivore.. He hunted and ate.. - NCP leader's controversial comments.. (Video)..ISR

Jitendra Awhad : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత జితేంద్ర అవద్ రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు మాంసాహారి అని, ఆయన వేటాటి మాంసాన్ని తినేవారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పలు వర్గాలు ఆయనపై విమర్శలు వస్తున్నాయి. బీజేపీ కూడా ఈ వ్యాఖ్యల పట్ల మండిపడింది. 

ఒక ర్యాలీలో జితేంద్ర అవద్ పాల్గొని మాట్లాడారు. ‘‘రాముడు మావాడు, బహుజనులకు చెందినవాడు, రాముడు వేటాడి తినేవాడు. మేము శాకాహారిగా మారాలని మీరు కోరుకుంటున్నారు. కానీ మేము అతడిని (రాముడిని) ఆదర్శంగా భావిస్తాం. మటన్ తింటాము. ఆయన శాకాహారి కాదు, మాంసాహారి’’ అని అన్నారు. రాముడు ఒక క్షత్రియుడు అని అన్నారు. సాంప్రదాయకంగా క్షత్రియులంతా మాంసాహారులు అని ఆయన అన్నారు. కాబట్టి రాముడు ఏం తినేవారని ప్రశ్నించారు. 

భారతదేశాన్ని శాకాహార దేశంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని అవద్ అన్నారు. దేశ జనాభాలో 80 శాతం మంది ఇప్పటికీ మాంసాహారులేనని, వారు కూడా శ్రీరాముడి భక్తులేనని ఆయన పేర్కొన్నారు. ‘‘రాముడు ఏమి తినేవాడనే వివాదం ఏమిటి ? రాముడు మెంతికూర, కూరగాయలు తినేవాడని ఎవరైనా చెబుతారు. కానీ రాముడు క్షత్రియుడు. క్షత్రియులు మాంసాహారులు. నేను చెప్పినదానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. భారతదేశ జనాభాలో 80 శాతం మంది మాంసాహారులు, వారు కూడా రామభక్తులు.’’ అని ఎన్సీపీ నాయకుడు అన్నారు. ‘‘ఒక వ్యక్తి 14 సంత్సరాలు అడవిలో నివసించారు. ఆయన శాఖాహారం కోసం ఎక్కడికి వెళ్తారు. ? ఇది తప్పా, ఒప్పా ? నేను ఎప్పుడూ నిజమే చెబుతాను ’’ అని అన్నారు. కాగా వ్యాఖ్యలపై బీజేపీ నుంచి తీవ్ర స్పందన వచ్చింది. రాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విమర్శించింది.

అవద్ వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ‘ఎక్స్’ ఇలా పోస్ట్ పెట్టారు. ‘‘బాలాసాహెబ్ ఠాక్రే జీవించి ఉంటే, శివసేనకు చెందిన సామ్నా వార్తాపత్రిక 'రామ్ మాంసాహార' వ్యాఖ్యను విమర్శించేది. కానీ నేటి వాస్తవం ఏమిటంటే ? హిందువులను ఎవరు ఎగతాళి చేసినా వారు (ఉద్ధవ్ సేన) పట్టించుకోరు. వారు ఉదాసీనంగా ఉంటారు, మంచులా చల్లగా ఉంటారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు హిందుత్వం గురించి మాట్లాడతారు’’ అని పేర్కొన్నారు. రాజకీయాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్యే రామ్ కదమ్ పేర్కొన్నారు. కాగా, శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అవద్ పై బీజేపీ ఫిర్యాదు చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios