జమ్మూకాశ్మీర్ లో శనివారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. వీరిద్దరికీ లష్కరే తోయిబా (LeT)-ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)తో సంబంధాలున్నాయి.
ఉగ్రవాద ఏరివేత చర్యలు వేగంగా కొనసాగతున్నాయి. తాజాగా జమ్మూకాశ్మీర్ శ్రీనగర్ పట్టణంలోని జకురా ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి)-ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్)తో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులను శ్రీనగర్ పోలీసులు శనివారం ఉదయం మట్టుబెట్టారు.
ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని ఇఖ్లాక్ హజామ్‌గా గుర్తించినట్లు కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని హసన్‌పోరాలో ఇటీవల జరిగిన హెడ్ కానిస్టేబుల్ అలీ ముహమ్మద్ గనీ హత్యలో హజామ్ ప్రమేయం ఉంది. ఘటనా స్థలం నుంచి రెండు పిస్టల్స్‌తో సహా నిందితులను స్వాధీనం చేసుకున్నట్లు కుమార్ తెలిపారు.
కుల్గాం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా నియమితులైన ముహమ్మద్ గనీని జనవరి 29న హసన్‌పోరాలో అనుమానిత ఉగ్రవాదులు కాల్చిచంపారు.అనంత్‌నాగ్‌లోని బిజ్‌బెహరాలోని తబలా ప్రాంతంలోని ఆయన నివాసానికి సమీపంలోనే ఆయనపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆయనను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన మార్గమధ్యంలో మృతి చెందాడు.
ఈ వారం ప్రారంభంలో షోపియాన్ జిల్లాలోని అమిషిజిపోరా ప్రాంతంలో ఓ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు.. వెంటనే ఆయనను హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.
