తమిళనాడు మధురైలో జల్లికట్టులో 36 మందికి గాయాలు: పోటీలు ఎలా నిర్వహిస్తారో తెలుసా?
తమిళనాడులో జల్లికట్టు పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎద్దులను ఆపే క్రమంలో 36 మంది గాయపడ్డారు.
చెన్నై: పొంగల్ పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని మధురై జిల్లాలోని అవనియాపురంలో సోమవారం నాడు నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో 36 మంది గాయపడ్డారు. ఇందులో ఓ ఇన్స్ పెక్టర్ కూడ ఉన్నారు. గాయపడిన 36 మందిలో ఆరుగురిని చికిత్స నిమిత్తం మధురైలోని రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గతంలో తమిళనాడు రాష్ట్రంలోని పడుకొట్టైలో జల్లికట్టు పోటీల్లో 29 మంది గాయపడ్డారు.
సోమవారం నాడు ఉదయం నుండి జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు. జల్లికట్టు కోసం 1000 ఎద్దులు, 600 మంది యువకులు పాల్గొన్నారు. ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు జల్లికట్టు పోటీలు నిర్వహించనున్నారు.
తమిళనాడు ప్రజలు తమిళ మాసం థాయ్ ను ప్రారంభించారు. ఈ మాసం ప్రారంభ సూచికంగా బియ్యం, బెల్లంతో చేసిన పొంగల్ వంటకాన్ని సిద్దం చేశారు.పొంగల్ జరుపుకొనే రోజునే జల్లికట్టు పోటీ నిర్వహిస్తారు. ఎద్దులను మచ్చిక చేసుకొనే క్రీడనే జల్లికట్టుగా పిలుస్తారు. మధురై జిల్లాలోని అవనియాపురంలో ఇవాళ ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎనిమిది రౌండ్ల పాటు పోటీలు నిర్వహిస్తారు.
ప్రతి రౌండ్ లో 70 ఎద్దులను బుల్ టన్నెల్ లోకి వదులుతారు. ఈ ఎద్దులను మచ్చిక చేసుకొనేందుకు యువకులు బుల్ టన్నెల్ లోకి దిగుతారు. ఈ ఎద్దులను మచ్చిక చేసుకోనేందుకు యువకులు ప్రయత్నిస్తారు. ఎద్దుల కొమ్ములు పట్టుకోవడానికి, కాళ్లను పట్టుకోవడానికి యువకులను అనుమతించరు.
ఒక ఎద్దు 100 మీటర్లు దాటే వరక లేదా మూడు స్పిన్ లను పూర్తి చేసేవరకు ఎద్దును పట్టుకొంటే ఆ యువకుడిని విజేతగా నిర్ణయిస్తారు.బుల్ టన్నెల్ లోకి ఎద్దు వచ్చిన తర్వాతే దానిని పట్టుకోవడానికి యువకులకు అనుమతిస్తారు. ఎద్దులకు వైద్య పరీక్షలను నిర్వహించిన తర్వాతే జల్లికట్టు పోటీలకు అనుమతిస్తారు. అంతేకాదు ఈ పోటీలో పాల్గొనే యువకులకు కూడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
జల్లికట్టు పోటీలు నిర్వహించే ప్రాంతంలో మెడికల్ టీమ్ లు సిద్దంగా ఉంటాయి. అంబులెన్స్ లు, డాక్టర్లు కూడ అందుబాటులో ఉంటారు. అవనియాపురం వద్ద జల్లికట్టు పోటీలు నిర్వహించే ప్రాంగణం వద్ద 800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.అంతేకాదు వైద్య సేవలు అందించడానికి 20 మెడికల్ టీమ్ లు సిద్దంగా ఉన్నాయి.