తిరుపతి: కల్కి భగవాన్ ఆశ్రమాలపై శనివారం కూడా ఆదాయం పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.  చిత్తూరు జిల్లాలోని కల్కి భగవాన్ ఆశ్రమంలో తవ్వేకొద్దీ నగదు, నగలు, వజ్రాలు, ఆదాయంలో చూపని ఆస్తులు బయటపడుతున్నాయి. ఆశ్రమం ప్రధాన కేంద్రం వరదాయపాళెంతో పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైల్లోని అశ్రమాలు, కార్యాలయాలు, నివాసాల్లో జరిపిన సోదాల్లో దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తులు బయటపడినట్లు తెలుస్తోంది. 

రూ. 43.9 కోట్ల నగదు, రూ.18 కోట్ల విలువైన అమెరికా డాలర్లను అదనంగా అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. మరో రూ. 26 కోట్ల విలువైన 88 కిలోల బంగారం, ఐదు కోట్ల విలువైన వజ్రాలను కూడా ఐటి అధికారులు గుర్తించారు. భారత్ లో పన్ను చెల్లించాల్సిన ఆదాయాన్ని దారి మళ్లిస్తున్నారని, చైనా, అమెరికా, సింగపూర్, యుఐఈతో పాటు పలు దేశాల్లో కల్లి భగవాన్ వ్యాపారాలు విస్తరించాయని అధికారులు అంటున్నారు. 

Video:కల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు... ఆంధ్ర, తమిళనాడుల్లో ఎనిమిది బృందాలు

రియల్ ఎస్టేట్, నిర్మాణం, క్రీడారంగాల్లో కల్కి భగవాన్ పెట్టుబడులు పెడుతున్నారని, కల్కి భగవాన్ తో పాటు ఆయన కుమారుడు ఈ లావాదేవీలను చూస్తున్నారని ఐటి శాఖ తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కల్కి భగవాన్ రూ.409 కోట్ల మేరకు అక్రమంగా ఆదాయాన్ని కూడబెట్టారని గుర్తించినట్లు తెలిపింది. ఐటి శాఖ కల్కి భగవాన్ అని కాకుండా ఏకత్వ సిద్ధాంద గురువు అని పేర్కొంటోంది.

అసలు పేరు ఇదీ...

తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తంకు చెందిన కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 ఏళ్లు. చెన్నైలోని ఎల్ఐసీ ఏజెంట్ గా జీవితాన్ని ప్రారంభించారు. 1980లో జీవాశ్రమం పేరు మీద ఓ అశ్రమం లాంటి పాఠశాలను ప్రారంభించారు.  తర్వాత దాన్ని వన్ నెస్ యూనివర్శిటీగా మార్చారు. కల్కి భగవాన్ సతీమణి పద్మావతి, ఆయన కుమారుడు కృష్ణ కలిసి ఓ ట్రస్టు మాదిరిగా దాన్ని నడుపుతున్నారు. 

దాంతో దేశవిదేశాలకు చెందిన భక్తులను ఆకర్షించారు. 1989లో తాను విష్ణుమూర్తి అవతారాల్లోని కల్కి భగవాన్ అని తనకు తానుగా ప్రకటించుకున్నారు. చెన్నై వూందమల్లి సమీపంలో ఓ అశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక ప్రబోధాలు ప్రారంభించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో వందలాది ఎకరాల్లో నిర్మించుకున్న ఆశ్రమాన్ని కేంద్రంగా చేసుకున్నారు. తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో శాఖలను విస్తరింపజేశారు. ఆశ్రమాల్లో ఏం జరుగుతుందో ఆంతరంగికులకు బయటి ప్రపంచానికి తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడతారు.

విదేశీ యువతులు మాయం

ఐటి శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ కల్కి భగవాన్ దంపతులు ఎక్కడున్నారనే విషయం తెలియడం లేదు. అశ్రమానికి వచ్చిన పలువురు విదేశీ యువతులు మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆఫ్రికా, ఐరోపా దేశాల నుంచి చట్టవిరుద్ధంగా ఆశ్రమానికి ముడుపులు వస్తున్నట్లుగా కూడా ఆరోపణలున్నాయి. తమిళనాడులో మాత్రమే కల్కి భగవాన్ సంబంధీకులు వేయి ఎకరాల భూములు కొన్నట్లు, అనేక కంపెనీల్లో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. 

కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ బెంగళూరులో రూ.1000 కోట్ల పెట్టుబడితో రియల్ ఎస్టేట్ కంపెనీ, లాస్ ఏంజెల్స్ లో మరో కంపెనీ నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో 400 మంది ఐటి అధికారులు ఏకకాలంలో 40 కల్కి భగవాన్ కేంద్రాలపై బుధవారం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. విదేశీ నగదు కలుపుకుని మొత్తం రూ. 500 కోట్లు ఐటి అధికారులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.