భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-46 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ-46 557 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి ప్రవేశపెట్టింది.

25 గంటల కౌంట్ డౌన్ ముగిసిన అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-46 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది.

అత్యంత ఆధునికమైన రాడార్ ఇమేజింగ్ భూ ఉపగ్రహమైన రీశాట్-2బీఆర్1 కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఉపగ్రహం రక్షణశాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది.

అంతేకాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తులో ఈ ఉపగ్రహం సాయపడనుంది. పీఎస్ఎల్వీ ప్రయోగాలతో ఇది 48వ ప్రయోగం.