ISRO : సూర్యుడిపై తొలి ఫోటోలు బంధించిన ‘‘ Aditya-L1 ’’.. సరికొత్త శకానికి నాంది అంటోన్న శాస్త్రవేత్తలు
ఇస్రో పంపిన ఆదిత్య ఎల్ 1 స్పేస్ క్రాఫ్ట్ నిర్దేశిత మార్గం వైపు వేగంగా దూసుకెళ్తోంది. దానికి అమర్చిచిన అత్యాధునిక సోలార్ అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్‌యూఐటీ) సూర్యుని అతినీలలోహిత తరంగ ధైర్ఘ్యాలను విజయవంతంగా క్యాప్చర్ చేసి అరుదైన మైలురాయిని అందుకుంది.
చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై ప్రపంచం దృష్టి పెట్టింది. అగ్రరాజ్యాల కంటే చాలా తక్కువ ఖర్చుతోనే భారీ ప్రయోగాలు చేపట్టడంతో .. మన విజయ రహస్యం ఏంటన్నది తెలుసుకునేందుకు ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే ఊపులో ఇస్రో చేపట్టిన మిషన్ ‘‘ఆదిత్య ఎల్ 1’’. ఏళ్లుగా మనిషికి కొరకరాని కొయ్యగా మారిన సూర్యుడి గుట్టు విప్పేందుకు ఇస్రో ఈ యాత్ర చేపట్టింది.
ఇస్రో పంపిన ఆదిత్య ఎల్ 1 స్పేస్ క్రాఫ్ట్ నిర్దేశిత మార్గం వైపు వేగంగా దూసుకెళ్తోంది. దానికి అమర్చిచిన అత్యాధునిక సోలార్ అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్‌యూఐటీ) సూర్యుని అతినీలలోహిత తరంగ ధైర్ఘ్యాలను విజయవంతంగా క్యాప్చర్ చేసి అరుదైన మైలురాయిని అందుకుంది. సూర్యుని ఫోటోస్పియర్ , క్రోమోస్పియర్‌ను అర్ధం చేసుకోవడానికి కీలకమైన స్పెక్ట్రమ్ అయిన 200-400 ఎన్ఎం తరంగదైర్ఘ్యం పరిధిలో ఆదిత్య ఎల్ 1 ఈ ఫీట్ అందుకుంది.
మొదటి లైట్ సైన్స్ చిత్రాలు :
ముందస్తు కమీషనింగ్ దశ తర్వాత ఎస్‌యూఐటి పరికరం నవంబర్ 30న యాక్టివేట్ (విద్యుత్ ప్రసరణ జరగడం) అయ్యింది. డిసెంబర్ 6న దాని తొలి లైట్ సైన్స్ చిత్రాలను క్యాప్చర్ చేసింది. 11 వేర్వేరు ఫిల్టర్లను ఉపయోగించి పొందిన ఈ చిత్రాలు సౌర పరిశీలనలో గణనీయమైన పురోగతిని సూచిస్తాయి. సూర్యుని క్లిష్టమైన లక్షణాలను ఈ ఫోటోలు వివరించనున్నాయి.
సూర్యుని క్లిష్టమైన లక్షణాల ఆవిష్కరణ :
సన్‌స్పాట్‌లు, ప్లేజ్, నిశ్శబ్ధ సూర్య ప్రాంతాలు వంటి కీలకమైన సౌర లక్షణాలను ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. అయస్కాంతీకరించిన సౌర వాతావరణంలోని డైనమిక్ ఇంటరాక్షన్, భూ వాతావరణంపై సౌర వికిరణ ప్రభావాన్ని అర్ధం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఈ పరిశీలనలు చాలా ముఖ్యం.
ఎస్‌యూఐటీ రూపకల్పన వెనుక :
పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐయూసీఏఏ) నేతృత్వంలోని శాస్త్రవేత్తల కృషి ఫలితమే ఎస్‌యూఐటీ. ఇస్రో, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఐఐఎస్ఈఆర్, కోల్‌కతాలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్స్ ఇండియన్ (సీఈఎస్ఎస్ఐ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు, ఉదయ్‌పూర్ సోలార్ అబ్జర్వేటరీ (యూఎస్‌వో పీఆర్ఎల్), తేజ్‌పూర్ యూనివర్సిటీలు దీని తయారీ వెనుక భాగం పంచుకున్నాయి.
సోలార్ సైన్స్ అభివృద్ధి:
ఆదిత్య ఎల్ 1పై ఎస్‌యూఐటీ పేలోడ్ విజయం సౌరశాస్త్రంలో ఒక కొత్త శకాన్ని సూచిస్తుంది. భూమిపై సూర్యుని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి , సౌర డైనమిక్స్‌పై అవగాహనను మరింత పెంచడానికి శాస్త్రవేత్తలకు ఇది విలువైన డేటాను అందిస్తుంది.