ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ లో అవకతవకలు.. బీజేపీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలి - కాంగ్రెస్
ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చిన చాలా కంపెనీలపై ఐటీ లేదా ఈడీ దాడులు చేసిందని పేర్కొంది. కాబట్టి దీనిపై సుప్రీంకోర్టుతో విచారణ జరగాలని, బీజేపీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేసింది.
ఎలక్టోరల్ బాండ్ల పథకంపై విచారణ జరిపించాలని, దర్యాప్తు పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన పలు కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేసినట్లు వెల్లడైన నేపథ్యంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై విరుచుకుపడ్డారు.
ఈడీ, ఐటీ, సీబీఐ దాడుల తర్వాతే ఇన్ని కంపెనీలు ఎందుకు విరాళాలు ఇచ్చాయని ప్రశ్నించారు. అలాంటి కంపెనీలపై ఒత్తిడి తెచ్చింది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఈడీ, ఐటీ దాడులను ఎదుర్కొన్న వారు బీజేపీలోకి వెళ్లి అక్కడ పార్టీ పదవులు పొందారని ఖర్గే ఆరోపించారు. బీజేపీలో వారు వెంటనే 'క్లీన్'గా మారిపోయారని చెప్పారు.
ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా బీజేపీకి దాదాపు 50 శాతం విరాళాలు రాగా, కాంగ్రెస్ కు 11 శాతం మాత్రమే వచ్చాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయని మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినా బీజేపీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. తమ పార్టీకి ఖాతాల్లో దాదాపు రూ.300 కోట్లు స్తంభించిపోయాయని, ఎన్నికలను పార్టీ ఎలా ఎదుర్కొంటుందని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. ఏఐసీసీ ట్రెజరీ అజయ్ మాకెన్ కూడా బీజేపీ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ కు సంబంధించిన జాబితాను విడుదల చేసిందని తెలిపారు. అందులో 2018 నుంచి మొత్తం 22,217 బాండ్లు జారీ అయ్యానని తెలుస్తోందని, కానీ వెబ్ సైట్ లో 18,871 బాండ్లు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు. 3,346 బాండ్ల వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో లేవని ఆరోపించారు.
‘‘మోడీ ప్రభుత్వం ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది? దీనిపై విచారణ జరగాలి. ఐటీ, ఈడీ దాడులను ఈ బాండ్లతో ముడిపెట్టాలి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చిన చాలా కంపెనీలపై ఐటీ లేదా ఈడీ దాడులు చేసింది. బీజేపీ ఒత్తిడితో బాండ్లు కొనుగోలు చేశారు.’’ అని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని, బీజేపీ బ్యాంకు ఖాతాలు స్థంభింపజేయాలని అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు.