Global Hunger Index 2023: ప్రపంచ ఆకలి సూచీలో మరింత దిగజారిన భారత్.. స్థానమెంత?
Global Hunger Index 2023: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారతదేశ పరిస్థితి మరింత దిగజారింది. 125 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 111వ స్థానానికి చేరుకుంది.
Global Hunger Index 2023: మన దేశంలో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. ఈ విషయం గ్లోబల్ హాజర్ ఇండెక్స్ 2023 ద్వారా వెళ్లడైంది. మొత్తం 125 దేశాలతో రూపొందించిన జాబితాలో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గతేడాది (2022 లో) మొత్తం 121 దేశాల్లో 107వ స్థానంలో నిలవగా.. ఈ ఏడాది మాత్రం మరో ఆరు స్థానాలు దిగజారి 111వ స్థానంలో నిలిచింది. మన దేశంలో ఆకలి సూచీ 28.7గా ఉండడం చూస్తే.. దేశంలో ఆకలి స్థాయి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.
ఇది మాత్రమే కాదు.. దేశంలోని పిల్లల్లో పోషకాహార లోపం రేటు అత్యధికంగా 18.7 శాతంగా ఉందని కూడా పేర్కొంది. భారతదేశంలో 'ఆకలి' పరిస్థితిని తీవ్రంగా అభివర్ణించారు. అయితే.. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023ని భారత్ తిరస్కరించింది. ఇలాంటి అవాస్తవ నివేదికలు మన దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని భారతదేశం పేర్కొంది. తాజా ఇండెక్స్ గురువారం విడుదలైంది. అంతకుముందు.. 2022లో భారతదేశం 121 దేశాలలో 107వ స్థానంలో నిలిచింది.
పొరుగుదేశాలు మనకంటే బెటర్
పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలు మన దేశం కంటే మెరుగైన స్థానంలో నిలువడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత్ పొరుగు దేశాలలో పాకిస్థాన్ 102వ స్థానంలో, బంగ్లాదేశ్ 81వ స్థానంలో, నేపాల్ 69వ స్థానంలో, శ్రీలంక 60వ స్థానంలో నిలిచాయి. ప్రపంచ ఆకలి విషయంలో ఈ దేశాలు భారతదేశం కంటే మెరుగైన పనితీరును కనబరిచాయి.
పిల్లల వృధా రేటు ప్రపంచంలోనే అత్యధికంగా 18.7 శాతంగా భారత్‌లో ఉందని ఈ నివేదిక పేర్కొంది. ఇది తీవ్రమైన పోషకాహార లోపాన్ని సూచిస్తుంది. అదే సమయంలో, భారతదేశంలో పోషకాహార లోపం రేటు 16.6 శాతం కాగా.. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 3.1 శాతంగా నమోదైంది. అలాగే 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో రక్తహీనత ప్రాబల్యం 58.1 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) అనేది ప్రపంచ, ప్రాంతీయ , జాతీయ స్థాయిలలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి, ట్రాక్ చేయడానికి ఒక సాధనం.
లెక్కలను తోసిపుచ్చిన ప్రభుత్వం
అదే సమయంలో.. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ సూచికను తిరస్కరించింది. ప్రభుత్వం దీనిని ఆకలితో సరికాని కొలతగా పేర్కొంది. ఇది భారతదేశంలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందులో చాలా లోపాలున్నాయి. ఈ సూచికను లెక్కించడానికి ఉపయోగించే నాలుగు సూచికలలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, కాబట్టి అవి మొత్తం జనాభా ఆరోగ్యాన్ని ఖచ్చితంగా ప్రతిబింబించలేవని కేంద్రం తిరస్కరించింది.