బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణానికి గౌరవ సూచకంగా సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణానికి గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం ఒక‌రోజు సంతాప దినాన్ని ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినంగా నిర్వహించాలని భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు పేర్కొంది. ఈ రోజున క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం భారతదేశంలో జాతీయ జెండాను అవతనం చేయనున్నాయి. కేవ‌లం భార‌త్ లోనే కాదు.. 54 దేశాలలో జాతీయ జెండాలను అవతనం చేయనున్నాయి. బ్రిటన్‌లో మాత్రం 10 నుంచి 12 రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా నిర్ణయించారు.

అంతకుముందు.. బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఎలిజబెత్ II మన కాలపు మహా నాయ‌కురాలిగా గుర్తుండిపోతారని ప్రధాని మోదీ అన్నారు. ఆమె తన దేశానికి, ప్రజలకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించారని తెలిపారు. ప్రస్తుతం ఆమె కుటుంబంతోపాటు, బ్రిటన్ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారని, హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. 2015, 2018లో లండ‌న్ ప‌ర్య‌ట‌న సమయంలో ఆమెను తాను కలిశాననీ, ఓ సమావేశంలో మహాత్మా గాంధీ తన పెళ్లిలో బహుమతిగా ఇచ్చిన రుమాలును తన‌కు చూపించార‌ని ప్రధాని మోదీ అన్నారు.

స్కాట్లాండ్‌లో తుదిశ్వాస 

దాదాపు 70 ఏళ్ల పాటు సుధీర్ఘంగా పాలించిన బ్రిటన్‌ మహారాణి క్వీన్ ఎలిజబెత్ II స్కాట్లాండ్‌లో తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 96 ఏళ్లు. రాణి మరణవార్తను ఆమె నివాస భవనం బకింగ్‌హాం ప్యాలెస్‌ గురువారం సాయంత్రం ప్రకటించింది. మ‌హారాణి మరణానంతరం ఆమె కుమారుడు చార్లెస్‌, బ్రిటన్‌తోపాటు 14 కామన్వెల్త్‌ దేశాలకు రాజుగా బాధ్యతలు చేపట్టానున్నారు. క్వీన్ ఎలిజబెత్ II ఆమె మరణానికి రెండు రోజుల ముందు చివరిసారిగా బహిరంగంగా కనిపించింది. బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌తో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని రాణి ట్రస్‌ని కోరింది.


10 రోజుల తర్వాత అంత్యక్రియలు 

రాణి మరణించిన 10 రోజుల తర్వాత ఆమె అంత్యక్రియలు జరుగుతాయి. అంతకుముందు, ఆమె శవపేటికను మరణించిన ఐదు రోజుల తర్వాత లండన్ నుండి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌కు ఉత్సవ మార్గంలో తీసుకువెళతారు. ఈ సమయంలో ప్రజలు ఆమెకు చివ‌రి సారిగా వీడ్కోలు ప‌లుకుతారు. రాణిని విండ్సర్ కాజిల్‌లోని కింగ్ జార్జ్ VI మెమోరియల్ చాపెల్‌లో ఖననం చేస్తారు.