కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ అల్లుడు వి.జి.సిద్ధార్థ ఆత్మహత్య దేశంలో సంచలనం కలిగించింది. అదృశ్యమవ్వడానికి ముందు సంస్థ ఉద్యోగులకు ఆయన రాసిన లేఖలో తనను ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇబ్బంది పెట్టినట్లు పేర్కొనడంతో ఆ శాఖపై విమర్శలు వస్తున్నాయి.

దీంతో ఐటీ శాఖ స్పందించింది. తాము సిద్ధార్థను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని.. ఆయన విషయంలో చట్ట ప్రకారమే వ్యవహరించామన్నారు. మైండ్ ట్రీలో వాటాల విక్రయం ద్వారా సిద్ధార్థ రూ. 3,200 కోట్లు పొందారని.. దీనికి రూ. 3,00 కోట్లు పన్ను చెల్లించాల్సి ఉండగా.. రూ. 46 కోట్లే చెల్లించారని ఐటీ అధికారులు వెల్లడించారు.

సిద్ధార్థ పేరుతో విడుదలైన లేఖలో ఆయన సంతకం... తమ రికార్డుల్లోని సంతకంతో సరిపోవడం లేదని ఐటీ అధికారులు తెలిపారు. కాగా.. సోమవారం సాయంత్రం మంగళూరు సమీపంలోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు.

దీంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలించి.. బుధవారం తెల్లవారుజామున సిద్ధార్థ మృతదేహాన్ని గుర్తించారు.