రామలయ ప్రారంభోత్సవం.. అది ఆర్ఎస్ఎస్-బీజేపీ కార్యక్రమం.. దానికి రాలేము - కాంగ్రెస్
ఎన్నికల్లో లబ్ది పొందేందుకే అసంపూర్తిగా ఉన్న అయోధ్య రామాలయాన్ని (ayodhya ram mandir opening) ఆర్ఎస్ఎస్-బీజేపీలు (RSS-BJP)ప్రారంభిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ (Congress party)ఆరోపించింది. అందుకే తాము ఆ కార్యక్రమానికి హాజరు కాలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది. అది ఆర్ఎస్ఎస్- బీజేపీ కార్యక్రమమే అని స్పష్టమవుతోందని పేర్కొంది. అసంపూర్తిగా ఉన్న ఆలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆరెస్సెస్ నేతలు ఎన్నికల లబ్ది కోసమే తెరపైకి తెచ్చారని ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
2019 సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి, శ్రీరాముడిని ఆరాధించే లక్షలాది మంది మనోభావాలను గౌరవిస్తూనే, మల్లికార్జున ఖర్గే, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ అధీర్ రంజన్ చౌధురిలు ‘ఆర్ఎస్ఎస్- బీజేపీ’ కార్యక్రమానికి ఆహ్వానాన్ని గౌరవంగా తిరస్కరించారని ఆ ప్రకటన తెలిపింది.
అయోధ్యలో జరిగే రామలల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులను ఆహ్వానించారు. ఇందులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లు కూడా ఉన్నారు. వీరితో పాటు బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి తదితర విపక్ష నేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.