దేశ వాణిజ్య రాజధాని ముంబై మరోసారి భారీ వర్షాలతో వణికిపోతోంది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

రోడ్లపై అడుగు మేర వర్షపునీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. పలు రైళ్లు, విమానాలను అధికారులు రద్దు చేశారు.

సియోన్ ప్రాంతంలోని ప్రధాన మార్గాలు వర్షపు నీటితో నిండిపోగా.. సియోన్ రైల్వేస్టేషన్‌లోకి పట్టాలపైకి భారీగా వరద నీరు చేరింది. ముంబైతో పాటు థానే, పల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.