Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్ కు దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలి- మంత్రి హరీశ్ రావు

తెలంగాణ నిరుద్యోగం కంటే, జాతీయ నిరుద్యోగమే ఎక్కువగా ఉందని, కాబట్టి దేశ వ్యాప్త నిరుద్యోగుల కోసం బండి సంజయ్ ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 1,32,899 ఉద్యోగాల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింద‌ని చెప్పారు

If the cart dares Sanjay, a billion march should be held in Delhi - Minister Harish Rao
Author
Hyderabad, First Published Jan 29, 2022, 5:29 PM IST

హైదరాబాద్ లోని గల్లీలో మిలియన్ మార్చ్ పెట్టడం కాదు, బండి సంజయ్ (bandi sanjay) కు దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని, దీనికి దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు వచ్చి ఆందోళనలు చేస్తారని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు (harish rao) స‌వాల్ విసిరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (puvvada ajay kumar), ఎంపీ నామా నాగేశ్వరరావు (nama nageshwar rao) లతో కలిసి హరీశ్ రావు శ‌నివారం ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై తీవ్రంగా మండిప‌డ్డారు. 

ఉద్యోగాల భ‌ర్తీపై శ్వేతప‌త్రం విడుద‌ల చేయాలి
నిరుద్యోగం అంటూ బీజేపీ (BJP) నేతలు దొంగ జ‌పం చేస్తున్నార‌ని హరీశ్ రావు ఆరోపించారు. ఈ తీరు చూస్తే దొంగే దొంగ అని అంటున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని ఎద్దేవా చేశారు. ఎవ‌రు నోటిఫికేష‌న్లు ఇచ్చారు ? ఎవరు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా ? దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా ?  ఈ ప్ర‌శ్న‌ల‌కు బండి సంజ‌య్, అత‌ని బ్యాచ్ స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. బీజేపీ హ‌యాంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

యువ‌త‌కు ఉద్యోగాలు రాకుండా బీజేపీ కుట్ర‌..
తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత నియామ‌కాలకు ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింద‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. టీఎస్‌పీఎస్సీ (tspsc), పోలీసు, సింగ‌రేణి, గురుకులాలు, విద్యుత్‌, మెడిక‌ల్ హెల్త్ త‌దిత‌ర విభాగాల్లో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 1,32,899 ఉద్యోగాల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింద‌ని చెప్పారు. మ‌రో 50-60 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని త‌మ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. నాన్ లోక్ విధానాన్ని ర‌ద్దు చేసి తెలంగాణ ప్ర‌జ‌ల‌కే వంద శాతం ఉద్యోగాలు ద‌క్కేలా చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని అన్నారు. 95శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ల‌భించేలా కొత్త జోన‌ల్ విధానాన్ని తీసుకొచ్చింద‌ని అన్నారు. దీని కోసమే 317 జీవోను (GO 317) ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌ని అన్నారు. ఈ ప్రక్రియ పూర్త‌యితే ఖాళీల‌ను గుర్తించి, కొత్త నోటిఫికేష‌న్లు ఇవ్వొచ్చ‌ని అన్నారు. దీనిని అడ్డుకుని, స్థానిక యువ‌త‌కు ఉద్యోగాలు రాకుండా బీజేపీ కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని ఆరోపించారు. రాష్ట్రపతి నిబంధనలకు లోబడి తెలంగాణ ప్ర‌భుత్వం జీవో నెంబర్ 317 తీసుకొచ్చింద‌ని అన్నారు. దీనిని బీజేపీ నేత‌లు వ్య‌తిరేకిస్తున్నారంటే.. కేంద్ర ప్ర‌భుత్వాన్ని, రాష్ట్ర‌పతిని విమ‌ర్శించ‌డ‌మే అవుతుంద‌ని అన్నారు. 

జాతీయ నిరుద్యోగ‌మే ఎక్కువ‌
చిన్న విష‌యాన్ని బీజేపీ భూతద్దంలో చూపెట్టి  ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టాల‌ని చూస్తోంద‌ని హ‌రీశ్ రావు ఆరోపించారు. ఇలా చేస్తే రాజకీయ లబ్ధి చేకూరుతుంద‌ని భావిస్తే అది మోస‌పోవ‌డమో అవతుంద‌ని, బండి సంజ‌య్ ప్ర‌చారాన్ని ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని అన్నారు. అయినా బీజేపీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే హ‌క్కు లేద‌ని అన్నారు. గ‌తేడాది డిసెంబర్‌ నాటికి దేశంలో 5.3 కోట్ల మంది ఉపాధి లేకుండా తిరుగుతున్నార‌ని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (CMIE) తాజాగా తెలిపింద‌ని  చెప్పారు. జాతీయ నిరుద్యోగ శాతం కంటే తెలంగాణలో నిరుద్యోగ శాతం మూడు రెట్లు తక్కువ అని ఆ సంస్థ స్ప‌ష్టం చేసింద‌ని అన్నారు. నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింద‌ని తెలిపారు.  

దేశంలో 15.62 ల‌క్ష‌ల ఉద్యోగ ఖాళీలు
దేశ వ్యాప్తంగా 15 లక్షల 62 వేల 962 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వ గ‌ణాంకాలే స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని మంత్రి హరీశ్ రావు అన్నారు. వాటిని భ‌ర్తీ చేయాల‌ని ప్ర‌ధాని ఇంటి ఎదుట ధ‌ర్నా చేయాల‌ని సూచించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ, ఏడేళ్ల‌లో 14 కోట్ల ఉద్యోగాలు ఎక్క‌డ భ‌ర్తీ చేసిందో లెక్క చూపించాల‌ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ దీక్ష పేరుతో రాష్ట్రంలో దొంగ దీక్షలు చేస్తున్న బీజేపీ నాయ‌కులు కేంద్రాన్ని ప్ర‌శ్నించాల‌ని అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే ఆ పార్టీకి క‌ళ్లు మండుతున్నాయ‌ని ఆరోపించారు. 

ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను అమ్మేస్తోంది..
కేంద్ర ప్ర‌భుత్వం అనేక ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను ప్రైవేట్ (Privet) కు అమ్మేసింద‌ని హ‌రీష్ రావు విమ‌ర్శించారు. దీంతో ఎంతో మంది రోడ్డున ప‌డ్డార‌ని, మ‌ళ్లీ ఇప్పుడు LIC తో పాటు అనేక కంపెనీల వాటాల‌ను అమ్మాల‌ని చేస్తోంద‌ని అన్నారు. దీంతో వేలాది మందికి ఉపాధి పోతుంద‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఉపాధి కోల్పొయిన రెండున్నర ల‌క్ష‌ల ఉద్యోగుల కుటుంబాల‌కు బీజేపీ నాయ‌కులు ఏమ‌ని స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు.  కేంద్ర తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్ల ఎంతో మంది ఎస్సీ,  ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ అభ్య‌ర్థులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని తెలిపారు. వాస్త‌వాలు ఇలా ఉన్నాయ‌ని, కానీ బీజేపీ చేసే గోబెల్స్ (gobels) ప్ర‌చారం వ‌ల్ల ప్ర‌జ‌ల‌ను న‌వ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక‌నైనాలా అలాంటి ప్ర‌చారాలు మానుకోవాల‌ని సూచించారు. 

తెలంగాణ‌కు ఒక్క ఐఐఐఎం కేటాయించ‌లే..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గ‌డిచిన ఏడేళ్ల‌లో దేశ వ్యాప్తంగా కొత్త‌గా 7 ఐఐఐఎం (IIIM)లు కేటాయించింద‌ని, అందులో తెలంగాణ‌కు ఒక్క ఐఐఐఎం రాలేద‌ని మంత్రి హ‌రీశ్ రావు విమ‌ర్శించారు. 16 ఐఐటీ (IIIT)లలో రాష్ట్రానికి ఒక్కటి కూడా రాలేద‌ని అన్నారు. 157 మెడిక‌ల్ కాలేజీలు (Medical collages), 84 న‌వోద‌య (navodaya) విద్యాల‌యాలు మంజూరైతే  అందులో తెలంగాణ‌కు ఒక్క‌టి కూడా లేద‌ని తెలిపారు. వీటిని రాష్ట్రానికి తెప్పించడం లో రాష్ట్రంలోని బీజీపీ ఎంపీ (Mp)లు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌ని ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios