ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన ప్రముఖ పాత్రికేయుడు, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్ధానాన్ని కోరారు.

బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్‌‌ తిరస్కరణనూ ఆయన సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. అర్నాబ్‌ తరపున ప్రముఖ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తూ.. ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తు చట్ట విరుద్ధంగా సాగుతోందని అన్నారు.

ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల బెంచ్ స్పందిస్తూ.. ‘టీవీ చానెల్స్‌ అరుపులను ప్రభుత్వాలు పట్టించుకుంటే ఎలా? రిపబ్లిక్‌ టీవీలో అతని అరుపులపై మీ ఎన్నికల భవిష్యత్‌ ఆధారపడిందా? మేం ఆ టీవీ చూడం.. కానీ, మహారాష్ట్ర సర్కార్‌ చేసింది సరైనదిగా అనిపించడం లేదని వ్యాఖ్యానించింది.

వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి దూస్తే మేమున్నామని గుర్తుంచుకోండి’అని సుప్రీం బెంచ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే, అర్నాబ్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను‌ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మాత్రమే పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 

అర్నాబ్‌ తరపు న్యాయవాది సాల్వే మాట్లాడుతూ.. తమ కేసు ఎఫ్‌ఐఆర్‌ దశ దాటిపోయిందని, దర్వాప్తు జరిగిన తర్వాతే మే, 2018లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు తెలిపారు. ఇక ఈ కేసు పునర్‌ దర్వాప్తు చేసే విషయంలో మహారాష్ట్ర సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.

కాగా, ఈ కేసులో గత బుధవారం అరెస్టయి జైలులో ఉన్న అర్నాబ్‌కు నవంబర్‌ 18 వరకు రాయిగఢ్‌ జిల్లా కోర్టు జ్యుడిషియల్‌ కస్టడి విధించిన సంగతి తెలిసిందే. ఇక మధ్యంతర బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే 2018లో మూసివేసిన ఈ ఆత్మహత్య కేసును మళ్లీ తవ్వారని అర్నాబ్‌ గోస్వామి వాదిస్తున్నారు.