పడుకునేటప్పుడు దిండు కింద ఫోన్.. పేలి వ్యక్తి భుజం, చేతికి తీవ్రగాయాలు..అని ఏసియానెట్ న్యూస్ తెలుగు పోర్టల్ లో సోమవారం ప్రచురించిన వార్తకు HMD గ్లోబల్ స్పందించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. 

‘HMD మా కస్టమర్ల కోసం మంచి నాణ్యత గల హ్యండ్ సెట్లను తయారు చేయడానికే కట్టుబడి ఉంటుంది. ఫోన్ల విషయంలో వినియోగదారుల అంచనాలను వమ్ము చేయం. మా ఉత్పత్తుల వల్ల కస్టమర్ల ఏదైనా సమస్యలు ఎదుర్కుంటే దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. కేరళలో జరిగిన ఈ కేసు విషయంలో కూడా మేము వెంటనే స్పందించాం.

వినియోగదారుడితో మాట్లాడాం. అయితే అతను ఆ ఫోన్ ను 2016లో అంటే నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేశాడని తేలింది. ఈ నోకియా ఫోన్ ను HMD అమ్మలేదు. అంతేకాదు కస్టమర్ తన ఫోన్ ను పారేసినట్టు తెలిపాడు. దీనిమీద తరువాత ఎలాంటి రిక్వెస్టూ లేదు’ అంటూ ఒక ప్రకటన వెలువరించారు. 

కేరళలోని కొల్లాం జిల్లాలో దిండుకింద పెట్టుకున్న ఫోన్ పేలి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. నోకియా ఫోన్ ను పడుకునే ముందు దిండు కింద పెట్టుకుని పడుకున్నాడు. ఫోన్ ఒక్కసారిగా పేలడంతో ఆ వ్యక్తి భుజం, ఎడమ మోచేతికి తీవ్రగాయాలయ్యాయి.