హిందీ మాట్లాడే వారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతారు - డీఎంకే నేత దయానిధి వివాదాస్పద వ్యాఖ్యలు
బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి తమిళనాడుకు వచ్చి హిందీ మాట్లాడేవారు (hindi speakers) రోడ్లు, టాయిలెట్లు శుభ్రం చేస్తున్నారని (cleaning toilets) డీఎంకే నేత, ఎంపీ దయానిధి మారన్ (DMK MP Dayanidhi Maran) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ (bjp) తీవ్ర స్థాయిలో మండిపడింది.
హిందీ భాషను మాట్లాడేవారిపై డీఎంకే నాయకుడు, ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి తమిళనాడుకు వచ్చే హిందీ మాట్లాడే ప్రజలు నిర్మాణ పనులు లేక రోడ్లు, మరుగుదొడ్లు శుభ్రం చేసుకుంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ ‘ఇండియా’ కూటమిలో సభ్యులుగా ఉండి, ఈ వ్యాఖ్యలపై స్పందించని పార్టీల మౌనంపై ప్రశ్నలు సంధించారు.
వైరల్ అయిన వీడియోలో.. ఎంపీ దయానిధి మారన్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్, హిందీ నేర్చుకున్న వ్యక్తులను పోల్చారు. ఇంగ్లీషు వచ్చిన వాళ్లు ఐటీ కంపెనీలకు వెళతారని, హిందీ మాత్రమే వచ్చిన వాళ్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు ట్విట్టర్ పోస్ట్ లో మండిపడ్డారు. ఇండియా కూటమి దేశంలోని ప్రజలను కులం, భాష, మతం ఆధారంగా విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందులో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించారు.
దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని షెహజాబ్ పూనావాలా అన్నారు. మారన్ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన ఇండియా బ్లాక్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన విమర్శించారు. నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, లాలూ యాదవ్, కాంగ్రెస్, ఎస్పీ, అఖిలేష్ యాదవ్ దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని పూనావాలా ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో హిందీ మాట్లాడే రాష్ట్రాలపై వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణమైన మరో డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్‌కుమార్‌పై ఇండియా కూటమి ఎలాంటి చర్యా తీసుకోలేదని అన్నారు. ఆయన హిందీ మాట్లాడే రాష్ట్రాలను 'ఆవు మూత్రం' రాష్ట్రాలుగా పేర్కొన్నారని గుర్తు చేశారు.
డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ పై భజరంగ్ పూనియా స్పందన ఇదే.. పద్మ శ్రీ వెనక్కి తీసుకుంటారా ?
పాత సంఘటనలపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లపై కూడా పూనావాలా విమర్శలు చేశారు. ‘‘మొదట రాహుల్ గాంధీ ఉత్తర భారత దేశ ఓటర్లను అవమాన పరిచారు. తరువాత రేవంత్ రెడ్డి ‘బీహార్ డీఎన్ఏ’ అంటూ విమర్శించారు. తరువాత డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ ‘గోమూత్ర రాష్ట్రాలు’ అంటూ అన్నారు. ఇప్పుడు దయానిధి మారన్ హిందీ మాట్లాడేవారిని, ఉత్తర భారతీయులను అవమానపర్చారు.’’ అని పేర్కొన్నారు.