హిజాబ్ వివాదం ఎన్నో మలుపులు తీసుకుంటోంది. హిజాబ్ కేసును విచారిస్తున్న న్యాయమూర్తిపై వ్యతిరేకంగా ట్వీట్ చేసినందుకు కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింసా తాజాగా అరెస్ట్ అయ్యారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
విద్యాసంస్థల్లో హిజాబ్ (hijab) నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న బెంచ్‌లో భాగమైన కర్ణాటక (karnataka) హైకోర్టు (high court) న్యాయమూర్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు కన్నడ సినీ నటుడు మరియు కార్యకర్త చేతన్ కుమార్ అహింసా (Chetan Kumar Ahimsa)ను పోలీసులు అరెస్టు చేశారు. దళిత అనుకూల సంస్థలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కొద్ది రోజులకే ఆయన అరెస్ట్ జరిగింది.
న్యాయమూర్తిపై ట్వీట్ చేసినందుకు చేతన్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. ‘కన్నడ సినీ నటుడు చేతన్ అహింసాను బెంగళూరు సిటీ పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తిపై చేసిన ట్వీట్ కారణంగా మంగళవారం సెల్ఫ్ ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఇందులో ఐపీసీ 505(2), 504 కింద కేసు నమోదు చేశాం. ట్వీట్ ను ఆధారంగా చేసుకొని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.” అని సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంఎన్ అనుచేత్ (Deputy Commissioner of Police of Central Division M N Anucheth) ఒక ప్రకటనలో పేర్కొన్నారు
అత్యాచారం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ కృష్ణ దీక్షిత్ ( justice Krishna Dixit) గురించి చేతన్ కుమార్ ఫిబ్రవరి 16న తన పాత ట్వీట్‌లలో ఒకదాన్ని రీ-ట్వీట్ చేశారు. జూన్ 27, 2020న ఆయన ఓ రేప్ నిందితుడికి హైకోర్టు న్యాయమూర్తి బెయిల్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.అదే ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ, “ ఇది నేను కర్ణాటక హైకోర్టు నిర్ణయానికి సంబంధించి దాదాపు రెండేళ్ల క్రితం రాసిన ట్వీట్. అత్యాచారం కేసులో జస్టిస్ కృష్ణ దీక్షిత్ ఇలాంటి ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదే న్యాయమూర్తి ప్రభుత్వ పాఠశాలల్లో హిజాబ్‌లు ఆమోదయోగ్యమైనవా కాదా అని నిర్ణయిస్తున్నారు..’’ అంటూ పోస్ట్ చేశారు.
రాయచూర్‌లో గణతంత్ర దినోత్సవం రోజున మహాత్మా గాంధీ ఫొటో పక్కన బీఆర్ అంబేద్కర్ ఫొటో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అప్పటి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి మల్లికార్జున గౌడ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులో ఫిబ్రవరి 19వ తేదీన భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆ తర్వాత ఆయన బెంగళూరులోని కర్ణాటక స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. ఈ నిరసనలో చేతన్ కుమార్ అహింసా పాల్గొన్నారు.
చేతన్‌ను అదుపులోకి తీసుకోవడంతో దళిత సంఘాల కార్యకర్తలు శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా చేతన్ భార్య మేఘా ఎస్ (Megha S ) మాట్లాడుతూ.. “నేను శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌కి వచ్చాను, కానీ వారు నాలుగు గంటలకు పైగా నాకు ఎలాంటి సమాచారాన్నిఇవ్వలేదు. నేను ఇంట్లో ఉన్నా కూడా నాకు సమాచారం ఇవ్వకుండా అతన్ని ఇంటి నుండి తీసుకొచ్చారు ’’ అని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. కర్నాటకలోని ఉడిపి పట్టణంలో ఓ కాలేజీలో ఈ హిజాబ్ వివాదం మొదలైంది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ వివాదంపై ఇప్పుడు కర్నాకట హైకోర్టు వాదనలు వింటోంది.
