కర్ణాటక హిజాబ్ వివాదం మరో మలుపు తీసుకుంది. విద్యార్థుల మధ్య గొడవగా ఉన్న ఈ వివాదం ఉపాధ్యాయులకూ పాకినట్టు తెలుస్తున్నది. కర్ణాటకలోని తుమకూరులోని జైన్ పీయూ కాలేజీలో ఇంగ్లీష్ బోధిస్తున్న లెక్చరర్ హిజాబ్ ధరించరాదనే ఆదేశాలు రావడంతో రాజీనామా చేసినట్టు వివరించారు. ఈ కొత్త నిర్ణయం తన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని పేర్కొన్నారు.
బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో హజాబ్ వివాదం(Hijab row) మరింత విస్తరిస్తున్నది. ఇప్పటి వరకు ఇది విద్యార్థుల(Students) మధ్య ఘర్షణగా కనిపించింది. ఇప్పుడు కొత్తగా ఇది ఉపాధ్యాయులకూ(Teachers) పాకినట్టు తెలుస్తున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో హిజాబ్ వివాదం మొదలైంది. ముస్లిం విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించవద్దనే డిమాండ్‌తో ఘర్షణ మొదలైంది. ఆ డిమాండ్‌ను మరింత బలంగా ప్రొజెక్ట్ చేయడానికి వారు కాషాయ వర్ణపు కండువాలను వేసుకుని వచ్చారు. ఆ ఘర్షణ రాష్ట్రమంతటా చుట్టేస్తున్నది. దేశమంతా ఈ వివాదంపై చర్చిస్తున్నది. ఇదిలా ఉండగా, కర్ణాటకలోని ఓ కాలేజీ లెక్చరర్ రాజీనామా(Resignation) చేస్తూ పేర్కొన్న కారణం మరోసారి హిజాబ్ వివాదంపై చర్చకు ఆజ్యం పోసింది.
తన ఆత్మాభిమానాన్ని పేర్కొంటూ ఆమె రాజీనామా లేఖను కాలేజీ యాజమాన్యానికి అందించారు. రాజీనామా లేఖలో ఆమె ఈ విధంగా పేర్కొన్నారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధిస్తున్న తాను ఆ పొజిషన్‌కు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఆ కాలేజీలో తాను మూడేళ్లుగా బోధిస్తున్నారని పేర్కొన్నారు. అప్పటి నుంచి తాను హిజాబ్ ధరించారని గుర్తు చేశారు. కానీ, తొలిసారిగా ఇప్పుడు కాలేజీ ప్రిన్సిపల్ తనను పిలిచి తాను హిజాబ్ ధరించరాదని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. మతాన్ని ఎంచుకునే హక్కు రాజ్యాంగం కల్పిస్తున్నదని, ఈ హక్కునూ ఎవరూ తిరస్కరించలేరని స్పష్టం చేశారు. హిజాబ్ ధరించాలని ఆదేశించిన కారణంగా తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ప్రిన్సిపల్ చర్యలను ఆమె ఖండిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
ఆమె రాజీనామా లేఖ రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. కర్ణాటకలో తుమకూరులోని జైన్ పీయూ కాలేజీలో లెక్చరర్ చాందిని ఆంగ్ల భాష బోధిస్తున్నారు. మూడేళ్లుగా ఆమె అక్కడ సేవలు అందిస్తున్నారు. కానీ, తొలిసారిగా ఆమెను హిజాబ్ తొలగించాలని ఆదేశించడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజీనామా లేఖ చర్చనీయాంశం కావడంతో విలేకరులు ఆమెపై ప్రశ్నలు కురిపించారు.
‘నేను జైన్ పీయూ కాలేజీలో గత మూడేళ్లుగా పని చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఏ సమస్యనూ ఎదుర్కోలేదు. కానీ, నిన్న మా ప్రిన్సిపల్ నాకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. నేను టీచింగ్ చేసేటప్పుడు ఇక నుంచి నేను హిజాబ్, ఇతర మతపరమైన సింబల్స్ ధరించవద్దని చెప్పారు. కానీ, నేను గత మూడేళ్లుగా హిజాబ్ ధరించే పాఠాలు చెబుతున్నాను. ఈ కొత్త నిర్ణయం నా ఆత్మ గౌరవాన్ని గాయపరిచింది. అందుకే ఇక రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను’ అని లెక్చరర్ చాందిని వివరించారు.
కాగా, కాలేజీ ప్రిన్సిపల్ కేటీ మంజునాథ్ మాత్రం ఈ వాదనను కొట్టిపారేశారు. తాను కానీ, మేనేజ్‌మెంట్‌లోని మరే ఇతరులైనా ఆమెను హిజాబ్ తొలగించాలని ఆదేశించలేదని పేర్కొన్నారు.
ఈ వివాదంపై చర్చ కేవలం మన దేశానికే పరిమితం కావడం లేదు. కొన్ని విదేశీ సంస్థలూ, దేశాలూ ఈ వివాదంపై వ్యాఖ్యలు చేస్తుండటాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఇది అంతర్గత వ్యవహారమని, బయటి వారికి ఈ వివాదంపై కామెంట్ చేసే హక్కు లేదని స్పష్టం చేసింది. హిజాబ్ వివాదం విదేశీ వ్యవహరాల అంశం కాదని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. ఇది దేశంలోని ఒక అంతర్గత విషయం అని వివరించారు. కాబట్టి, దీనిపై బయటి వారు ఎవరైనా.. లేదా వేరే దేశమైనా కామెంట్ చేయరాదని స్పష్టం చేశారు.
