Asianet News TeluguAsianet News Telugu

జార్ఖండ్‌‌లో విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

జార్ఖండ్‌ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం విజయం సాధించింది. హేమంత్ సోరెన్‌కు మద్దతుగా మొత్తం 48 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ  సస్పెన్షన్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. హేమంత్ సోరెన్ సభలో విశ్వాస పరీక్షను నిరూపించుకున్నారు.

Hemant Soren government wins trust vote in Jharkhand Assembly
Author
First Published Sep 5, 2022, 1:56 PM IST

జార్ఖండ్‌ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం విజయం సాధించింది. హేమంత్ సోరెన్‌కు మద్దతుగా మొత్తం 48 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ  సస్పెన్షన్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. హేమంత్ సోరెన్ సభలో విశ్వాస పరీక్షను నిరూపించుకున్నారు. ఇక, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రతిపక్ష బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, త‌న ఎమ్మెల్యేలను లాగేసుకుంటుంద‌నే భ‌యంతో సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేల‌ను నవ రాయ్‌పూర్‌లోని రిసార్ట్ కు త‌ర‌లించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం రాత్రి వారిని తిరిగి రాంచీకి రప్పించి.. నేడు అసెంబ్లీ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా హేమంత్ సోరెన్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడానికి అల్లర్లకు ఆజ్యం పోసి దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని ఏర్పరచడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ జార్ఖండ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ప్రజలు బట్టలు, రేషన్, కిరాణా కొంటారని తాము విన్నామని.. కానీ బీజేపీ మాత్రమే శాసనసభ్యులను కొనుగోలు చేస్తుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. 

ఇక, జార్ఖండ్ అసెంబ్లీ మొత్తం 81 మంది సభ్యులు ఉన్నారు. అధికార జేఎంఎం కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో జేఎంఎంకు 30 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 18 మంది, తేజస్వి యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌కి ఒకరు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలున్నారు.

తనకు తానే మైనింగ్ లీజుకు ఇవ్వడం ద్వారా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో హేమంత్ సోరెన్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. ‘‘నైతిక కారణాలతో’’ ముఖ్యమంత్రి పదవికి సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే.. ఒకవేళ సోరెన్‌ ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడితే.. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగలేరు. ఇప్పటికే.. ఎలక్షన్ కమిషన్ గవర్నర్‌కు తన అభిప్రాయాన్ని సమర్పించగా, ఆయన దానిపై నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది ఉత్కంఠగా మారింది. 

ఈ క్రమంలోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక.. రాష్ట్రాలలో మాదిరిగానే సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకుని.. అధికార సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జేఎంఎం ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే జార్ఖండ్ అసెంబ్లీలో సోరెన్ విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios