రుతుపవనాల రాకతో ఈ ఏడాది దేశంలోనే మొదటిసారి ముంబయిలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ముంబయి నగరం రోడ్లన్నీ జలమయమయ్యాయి.  మహారాష్ట్రలోని ముంబయి నగరంలోని విరార్, జుహు, ములుంద్ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది.

భారీ వర్షం వల్ల ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన ఓ విమానాన్ని దారి మళ్లించారు. భారీ వర్షం వల్ల రోడ్లతోపాటు పలు ప్రాంతాల్లో వరదనీరు నిలవడంతో పలువురు వాటి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ముంబై నగరం భారీవర్షంతో మళ్లీ మునిగింది అంటూ పలువురు నెటిజన్లు వరదనీటి కాల్వల ఫోటోలు, వీడియోలు పోస్టు చేశారు. 

నగరంలోని లోతట్టుప్రాంతాల్లో వరద పోటెత్తిన నేపథ్యంలో ప్రజలు మ్యాన్ హోళ్లను తెరవరాదని బృహన్ ముంబై అధికారులు కోరారు. వరద పీడిత ప్రాంతాల్లో ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ముంబై హైకోర్టు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. వరదనీరు ముంబైను ముంచెత్తిన నేపథ్యంలో తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని మున్సిపల్ అధికారులు చెప్పారు.