గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రాణ నష్టం కూడా చాలానే జరిగింది. కాగా... ఇప్పుడు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ లక్నో కేంద్రం అధికారులు మంగళవారం ఉదయం హెచ్చరికలు జారీ చేశారు.యూపీలోని ఆగ్రా, ఫిరోజాబాద్, ఈట్వాహ్, అరైయా, జాలన్, కన్నౌజ్, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్, ఉన్నవో, బిజనూర్ జిల్లాలతోపాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురుస్తుందని లక్నో వాతావరణకేంద్రం అధికారులు హెచ్చరించారు. రాగల మూడు గంటల్లో యూపీలోని పలు జిల్లాల్లో పిడుగులు పడవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పిడుగులు పడేటపుడు చెట్లకింద ఉండరాదని అధికారులు సూచించారు.