అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా... ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా.. కాలేజీల్లో ర్యాగింగ్ బూతాన్ని మాత్రం తరిమేయలేకపోతున్నారు. ఏదో సరదాగా ర్యాగింగ్ అంటే కాస్త పర్లేదు కానీ.. కొన్ని చోట్ల మితిమిరీ ప్రవర్తిస్తుంటారు. కొన్ని చోట్ల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. కాగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ర్యాగింగ్ పేరిట ఓ కేసు నమోదయ్యింది. సీనియర్లు రెచ్చిపోయి... జూనియర్ విద్యార్థులను ఇబ్బంది పెట్టారు.

ర్యాగింగ్ నిరోధానికి కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ సీనియర్లు రెచ్చిపోవడం గమనార్హం. సైఫాయ్ లోని వైద్య విశ్వవిద్యాలయంలోల సీనియర్ విద్యార్థులు తమ జూనియర్ల పట్ల దారుణంగా ప్రవర్తించారు. కాలేజీకి వచ్చే విద్యార్థులందరూ గుండు చేయించుకొని మాత్రమే కాలేజీలో అడుగుపెట్టాలని... కేవలం తెలుపు రంగు దుస్తులు మాత్రమే వేసుకోవాలని... సీనియర్లు కనిపించిన ప్రతిసారి సెల్యూట్ చేయాలని ఆదేశించారు.

సీనియర్లు చెప్పినట్లు చేయకపోతే... శిక్షిస్తారేమో అనే భయంతో విద్యార్థులంతా అలానే చేయడం గమనార్హం. దాదాపు 150 మంది విద్యార్థులు గుండ్లు చేయించుకొని రావడం గమనార్హం. అనంతరం సీనియర్లకు సెల్యూట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో యూనివర్శిటీపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

విమర్శలు ఎక్కువ కావడంతో యూనివర్శిటీ డీన్ రాజ్ కుమార్ స్పందించారు. తమ యూనివర్శిటీ పరిధిలో ర్యాగింగ్ కి చోటు లేదని.. విద్యార్థులపై నిఘా ఉంచామని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన కొందరు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.