కర్ణాటకలో రేవంత్ ఆరోపణల కలకలం.. కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా కేసీఆర్‌కు ఏం లాభం?: హెచ్‌డీ కుమారస్వామి
కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడ తమ పార్టీలోని ఓ ముఖ్య రాజకీయవేత్తకు రూ. 500 కోట్లు ఆఫర్ చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ తమ పార్టీలోని ఓ ముఖ్య రాజకీయవేత్తకు రూ. 500 కోట్లు ఆఫర్ చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ ఆరోపణలు ప్రస్తుతం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారాయి. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. విజయపురిలో కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఓడిపోతే కేసీఆర్‌కు ఏం లాభం అని ప్రశ్నించారు. బీజేపీపైనే కేసీఆర్ పోరాటం అని.. కాంగ్రెస్‌కు వ్యతిరేకం కాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రకటనపై తనకు ఎలాంటి క్లూ లేదని అన్నారు. ఏ నేపథ్యంలో ఆయన ఇలా అన్నారో తెలియదని చెప్పారు.
జేడీఎస్ పంచరత్న యాత్రపై తాను దృష్టి సారిస్తున్నానని చెప్పారు. నాకు డబ్బు కంటే ప్రజల ఆశీస్సులు కావాలి అని చెప్పారు. చామరాజ్‌పేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ఇటీవల హైదరాబాద్‌లో కేసీఆర్‌తో సమావేశం కావడం గురించి మీడియా ప్రశ్నించగా.. ఎవరైనా ఎవరినైనా కలవవచ్చు అని కుమారస్వామి సమాధానం చెప్పారు.
ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా మాట్లాడారు. రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై వచ్చిన కథనాలను తాను చదివానని.. దీనిపై నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తానని చెప్పారు.
ఇక, ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా తాను బీజేపీకి వ్యతిరేకమని కేసీఆర్ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది వాస్తవం కాదు. కాంగ్రెస్‌ను ఓడించడం లేదా బలహీనపరచడం ద్వారా బీజేపీకి సహాయం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలోని ఓ రాజకీయ నాయకుడికి కేసీఆర్ రూ. 500 కోట్లు ఆఫర్ చేసి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఆ నాయకుడితో చర్చలు జరిపినట్లు ప్రూఫ్‌ను త్వరలోనే బయటపెడతాం.
కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆయన బృందంతో తయారు చేసిన సర్వే నివేదికలను కాంగ్రెస్ వార్‌రూమ్ నుంచి కేసీఆర్‌కు అందాయి. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ సర్వే ద్వారా 130 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని కేసీఆర్‌కు తెలిసిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ 30 స్థానాల్లో స్వల్ప విజయం సాధించే అవకాశం ఉన్నందున.. ఈ స్థానాల్లోనైనా మా అభ్యర్థులను ఓడించాలని కేసీఆర్ తన ప్రయత్నాలను ప్రారంభించారు’’ అని అన్నారు. కేసీఆర్ కుయుక్తులు జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామికి తెలిశాయని, అందుకే ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభకు ఆయన హాజరుకాలేదని ఆరోపించారు.