హెచ్‌డీ కుమారస్వామి : బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం
తన పార్టీకి తక్కువ సీట్లే వచ్చినా పలుమార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టి లక్కీ పొలిటిషీయన్‌గా కుమారస్వామి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ చిత్రాలను పంపిణీ చేసి మంచి లాభాలను అందుకున్న కుమారస్వామి అనంతరం చన్నాంబిక ఫిల్మ్స్‌ను స్థాపించి ఎన్నో విజయవంతమూన చిత్రాలను నిర్మించారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తండ్రి దేవెగౌడ అనుమతి లేకుండా బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. 2006 నుంచి 2007 వరకు తొలిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. మే 28, 2018న కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేశారు
హరదన్నహళ్లి దేవెగౌడ కుమారస్వామి.. షార్ట్ కట్‌లో హెచ్ డీ కుమారస్వామి. భారతదేశ రాజకీయాలను ముఖ్యంగా దక్షిణాది పాలిటిక్స్‌ను ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) నేతగా, కర్ణాటక మాజీ సీఎంగా ఆయన ప్రజలకు సుపరిచితులు. తన పార్టీకి తక్కువ సీట్లే వచ్చినా పలుమార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టి లక్కీ పొలిటిషీయన్‌గా కుమారస్వామి గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ కూటమి నుంచి తప్పుకుని బీజేపీతో జత కట్టిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన కుటుంబానికి పట్టున్న మాండ్య నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలో దిగనున్నారు. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో కుమారస్వామి కూడా ఒకరు.
కుమారస్వామి బాల్యం , విద్యాభ్యాసం :
మాజీ ప్రధాని , జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ కుమారుడే కుమారస్వామి. ఆయన సోదరుడు హెచ్‌డీ రేవణ్ణ మాజీ మంత్రి. కుమారస్వామి డిసెంబర్ 16, 1959న హసన్ జిల్లా హరదనహళ్లి గ్రామంలో జన్మించారు. బెంగళూరులోని జయనగర్ నేషనల్ కాలేజీల్ బీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టారు. 1986లో అనితా కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. కన్నడ చిత్రాలను పంపిణీ చేసి మంచి లాభాలను అందుకున్న కుమారస్వామి అనంతరం చన్నాంబిక ఫిల్మ్స్‌ను స్థాపించి ఎన్నో విజయవంతమూన చిత్రాలను నిర్మించారు. తర్వాత తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కుమారస్వామి .. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
కుమారస్వామి .. బీజేపీ మద్ధతుతో తొలిసారి సీఎంగా :
అయితే 1998లో కనకపురా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1999లో అప్పటి సాతనూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి పరాజయాన్ని మూటకట్టుకున్నారు. రాంనగర్ నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తండ్రి దేవెగౌడ అనుమతి లేకుండా బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. 2006 నుంచి 2007 వరకు తొలిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర, చెన్నపట్నం నుంచి పోటీ చేసిన కుమారస్వామి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మే 28, 2018న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.
ఈ పరిణామాలతో కాంగ్రెస్‌కు కుమారస్వామి దూరం జరిగి.. బీజేపీకి దగ్గరయ్యారు. అమిత్ షా , నరేంద్ర మోడీ, జేపీ నడ్డా వంటి నేతలతో ఆయన భేటీ అయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. మాండ్య నుంచి కుమారస్వామి పోటీ చేస్తున్నారు. జేడీఎస్‌కు, దేవెగౌడ కుటుంబానికి మాండ్య ప్రాంతంలో మంచి పట్టుంది. ఒక్కలిగ సామాజికవర్గానిదే మాండ్యలో ఆధిపత్యం. తనకు సేఫ్ సీటుగా భావించి కుమారస్వామి పోటీ చేస్తున్నారు.