కాంగ్రెస్ 'మెహంగాయ్ పర్ హల్లా బోల్' ర్యాలీకి ముందు రాహుల్ గాంధీ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా.. తన స్నేహితులకు లాభం చేకూర్చే విధంగా ముందుకు సాగుతున్నదని విమర్శించారు.
మెహంగాయ్ పర్ హల్లా బోల్-రాహుల్ గాంధీ: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో ద్వేషం, అసహనం, కోపం పెరుగుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం నాడు దేశరాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో జరిగిన కాంగ్రెస్ హల్లా బోల్ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
“భారతదేశంలో ద్వేషం పెరుగుతోంది. భారతదేశంలో ఇప్పటికే అందోళనకరంగా ఉన్న ద్రవ్యోల్బణం- నిరుద్యోగం పెరుగుతుందనే భయం అధికం అవుతోంది. దీని కారణంగా ద్వేషం పెరుగుతోంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశాన్ని విభజించి దేశంలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. దేశంలో కేవలం ఇద్దరు పారిశ్రామికవేత్తలు మాత్రమే ఈ భయం-ద్వేషంతో లబ్ది పొందుతున్నారు” అని రాహుల్ గాంధీ ర్యాలీలో అన్నారు. కోరుకున్నప్పటికీ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని విధంగా దేశ పరిస్థితి ఉందని పేర్కొన్నారు. “ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు, ప్రతిపక్షాలు పార్లమెంటులో తమ గళాన్ని పెంచడానికి ప్రయత్నించినప్పుడు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం దానిని అనుమతించదు… మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి సంస్థలపై ప్రభుత్వం దాడి చేస్తోంది” అని అన్నారు.
"వివాదాస్పద మూడు నల్ల వ్యవసాయ చట్టాలు రైతులకు సహాయం చేయడానికి కాదు, ఇద్దరు-ముగ్గురు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చడానికి తీసుకురాబడ్డాయి" అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారికి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉన్నందున 'భారత్ జోడో యాత్ర' ముఖ్యమైనదని అన్నారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని తెలిపారు. రాజ్యాంగం దేశానికి ఆత్మ అని, దానిని కాపాడేందుకు ప్రతి భారతీయుడు కృషి చేయాలని, లేకపోతే దేశాన్ని రక్షించలేమని హెచ్చరించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మత సామరస్యాన్ని పెంపొందించేందుకు సెప్టెంబర్ 7 నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 3,500 కిలో మీటర్ల 'భారత్ జోడో యాత్ర' ప్రారంభించనుంది. “మోడీకి వ్యతిరేకంగా ఉంటే ఎవరైనా దాడి చేస్తారు.. నన్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో 55 గంటల పాటు కూర్చోబెట్టారు, కానీ ప్రధానికి చెప్పాలనుకుంటున్నాను- నేను మీ ఈడీకి భయపడను” అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు
'రాహుల్ గాంధీ జిందాబాద్' అంటూ హోరెత్తిన రామ్ లీలా మైదాన్
ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించేందుకు వేలాది మంది కాంగ్రెస్ మద్దతుదారులు రాంలీలా మైదాన్‌కు చేరుకోవడంతో “రాహుల్ గాంధీ జిందాబాద్”, “సోనియా గాంధీ జిందాబాద్” నినాదాలతో అక్కడి ప్రాంగణం హోరెత్తింది. 'మెహంగాయ్ పర్ హల్లా బోల్' ర్యాలీకి హాజరయ్యేందుకు వచ్చిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీని మరోసారి పార్టీని నడిపించాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లు పట్టుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019 ఆగస్టు నుంచి సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీని నడిపిస్తున్నారు.
