Asianet News TeluguAsianet News Telugu

మాకెందుకు నార్కో పరీక్షలు: హత్రాస్ మృతురాలి కుటుంబ సభ్యులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ హథ్రాస్ ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారులు తమను బెదిరించారని, పోలీసులు ఎవరి మృతదేహాన్ని తగులబెట్టారో కూడా తమకు తెలియదని బాంబు పేల్చారు.

hathras gang rape victim family sensational comments up uttar pradesh govt
Author
Hathras, First Published Oct 3, 2020, 3:12 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ హథ్రాస్ ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారులు తమను బెదిరించారని, పోలీసులు ఎవరి మృతదేహాన్ని తగులబెట్టారో కూడా తమకు తెలియదని బాంబు పేల్చారు.

పోలీసులు హడావిడిగా అంత్యక్రియలు జరపాల్సిన అవసరం ఏంటని వారు నిలదీస్తున్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి తమకు నార్కో పరీక్షలు చేయాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు పోస్ట్‌మార్టం పూర్తయిన అనంతరం చడిచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇవాళ మధ్యాహ్నం మరోసారి హథ్రాస్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల క్రితం రాహుల్, ప్రియాంకలను యూపీ పోలీసులు నోయిడా వద్దే అడ్డుకున్నారు. అయితే శనివారమైనా వారిని బాధితురాలి గ్రామంలోకి వెళ్లనిస్తారా లేదా అన్నది తేలాల్సి వుంది.

రాహుల్, ప్రియాంకలు వస్తుండటంతో నోయిడాలో భారీగా బలగాలను మోహరించారు. అటు ఈ దారుణం వెలుగుచూసిన తర్వాత తొలిసారిగా గ్రామంలోకి మీడియాను అనుమతించారు.

గ్రామంలో సిట్ దర్యాప్తు పూర్తి కావడంతో మీడియా ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. దీంతో గ్రామంలోకి వెళ్లిన జాతీయ మీడియా ప్రతినిధులు.. బాధితురాలి ఇంటిని పరిశీలించారు.

ప్రస్తుతానికి మీడియాను మాత్రమే అనుమతించామని.. పై అధికారుల ఆదేశాలు అందిన తర్వాత ఎవరినైనా అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు. బాధిత కుటుంబసభ్యుల ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని, వారిని గృహ నిర్బంధం చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిజం కాదన్నారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్ డీజీపీ కూడా ఇవాళ హథ్రాస్‌లో పర్యటించనున్నారు. అటు ఈ దారుణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం.. బాధితురాలి కుటుంబానికి నార్కోటిక్ ఎనాలిసిస్ టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అటు ఈ ఘటనలో విధులు సక్రమంగా నిర్వహించని ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios