సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం పోలింగ్ మొదలైంది. ఈ రోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ పోలింగ్ సాగనుంది. కాగా... పోలింగ్ లో భాగంగా బీజేపీ నేత చేసిన ఓ పని ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

బీజేపీ నేత దుష్యంత్ చౌతాలా కుటుంబసభ్యులతో కలిసి ట్రాక్టర్ లో పోలింగ్ బూత్ కి చేరుకున్నారు. సిర్సాలోని పోలింగ్ బూత్ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం అదే ట్రాక్టర్ లో తిరిగి వెళ్లిపోయారు. కాగా.... ఆయన ట్రాక్టర్ లో వస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

  మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 3,237 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో 235మంది మహిళలు ఉన్నారు. మరోవైపు హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 24వ తేదీన వెలువడనున్నాయి. ఏ పార్టీ గెలుపు జెండా ఎగురవేస్తుందో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు ఆగాల్సిందే. 

కాగా, ప్రధాని మోదీ ఈ ఎన్నికలపై ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల పోలింగ్ మొదలైందని మోదీ పేర్కొన్నారు. పలు చోట్ల ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మోదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాగా... మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశారు.