అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హర్యానాలో అధికార, ప్రతిపక్షనేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఈవీఎం మెషిన్‌లపై వివాదాస్పదంగా ట్వీట్ చేశారు.

ఈవీఎం అంటే 33 every vote for modi అని.. అలాగే every vote for manohar అంటూ మిషన్ 75+ హ్యాష్‌ట్యాగ్‌ను, వీడియోను జతచేసి ట్వీట్ చేశారు. పార్లమెంటె ఎన్నికలకు సంబంధిచి ఈవీఎం అంటే ప్రతి ఓటు మోడీకేనని.. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రతి ఓటు మనోహర్‌ అన్నారు.

అయితే మోడీకి వేసినా తనకు వేసినా తామిద్దరి ఎన్నికల గుర్తు మాత్రం కమలమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ 75కు పైగా స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని వీడియోలో తెలిపారు.

సీఎం వ్యాఖ్యలతో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లపై ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ సహా మిగిలిన ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహించాలని తాము పట్టుబడుతున్నా... బీజేపీ మాత్రం ఈవీఎం పద్ధతిలోనే ఎందుకు వెళుతుందో ఇప్పుడు క్లారిటీ వచ్చిందంటూ చురకలు అంటించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం ఖట్టర్ వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు. హర్యానాలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగనుంది.. 24న ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు హర్యానాతో పాటు మహారాష్ట్రలోనూ అదే రోజున ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల ప్రచార ఘట్టం తుది అంకానికి చేరడంతో ఆ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు శివసేనకు చెందిన నేతే రాష్ట్రానికి సీఎం అవుతాడని ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే చెబుతున్నారని కానీ.. ఎన్డీయే అధికారంలోకి వస్తే కచ్చితంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ చెప్పారు.

రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు లేవని.. పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడి నిజమేనని షా స్పష్టం చేశారు. రెండు పార్టీల మైత్రికి ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.

మూడింట రెండొంతుల సీట్లు గెలుచుకుంటామని అమిత్ తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ 122 సీట్లు గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్‌కు 22 సీట్లు తక్కువగా రావడంతో శివసేన మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.