తన కారును ఆపాడన్న కోపంతో హోంగార్డును ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడో బీజేపీ నేత. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని రేవారీకి చెందిన బీజేపీ నేత సతీశ్ ఖోడా సోమవారం తన కారులో వెళుతున్నారు.

ఈ క్రమంలో ఆయన కారు రాంగ్ రూట్‌లోకి ఎంటరైంది. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు కారును ఆపాలని సూచించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సతీశ్ వెంటనే అతనిని దగ్గరికి పిలిచి చెంప మీద కొట్టాడు.

అక్కడితో ఆగకుండా అతడిని తన కారుతో ఢీకొట్టి ముందుకు పోనిచ్చాడు. కారు బానెట్‌పై పడిన కానిస్టేబుల్‌ను దాదాపు 300 మీటర్లు అలాగే ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారు ఆపడంతో కానిస్టేబుల్ బయటపడ్డాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సతీశ్ కారు డ్రైవర్ స్పందించాడు.  తానే కారును రాంగ్ రూట్‌లోకి తీసుకెళ్లానని.. ఆపమన్న హోంగార్డును బతిమాలానని తెలిపాడు.

అయినప్పటికీ అతను వినకపోవడంతో కారును అలాగే ముందుకు పోనించానని, ఈ క్రమంలో అతను బానెట్‌కు చిక్కుకున్నాడని, తప్పు తనదేనని నేరం అంగీకరించాడు.