పవిత్రమైన అమ్మవారి ఆలయాన్ని కొందరు బీజేపీ నేతలు అపవిత్రం చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు మద్యం సీసాలు పంపిణీ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ లోని శ్రావణ దేవీ ఆలయంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్ ఆధ్వర్యంలో శ్రావణ దేవీ ఆలయంలో పాసి సమ్మేళన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి లంచ్ బాక్సుల్లో ఫుడ్ తోపాటు మద్యం సీసాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కొందరు చిన్నారులు కూడా పాల్గొనడంతో.. వారికి కూడా ఇవే బాక్సులు అందాయి.

భోజనం అనుకొని తిందామని చూసిన చిన్నారులు అందులో మద్యం సీసాలు చూసి ఖంగుతిన్నారు. దీంతో.. ఈ విషయం కాస్త బయటకు పాకి దుమారం లేపింది. కాగా.. ఈ ఘటనపై స్థానిక ఎంపీ అన్షుల్ వర్మ స్పందించారు.

అమ్మవారి దేవాలయంలో ఇలా మద్యం పంపిణీ చేయడం దురదృష్టకరమన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం వద్దకు తీసుకువెళ్లి.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామన్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన నితిన్ ఇటీవల బీజేపీలో చేరాడని.. అతని తండ్రే ఈ పనిచేశాడని ఎంపీ తెలిపారు.