బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత జగన్నాథ్ మిశ్రా పట్ల ఆ రాష్ట్ర పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారు. గత కొద్దినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

మూడు సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా సేవలందించిన మిశ్రా అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో బుధవారం ఆయన అంత్యక్రియల సమయంలో గౌరవవందనం సమర్పించేందుకు పోలీసులు తుపాకులు పేల్చగా.. అవి పేలలేదు.

సుమారు 22 మంది పోలీసులు ఒకేసారి గాల్లో కాల్పులు జరపడానికి ప్రయత్నించగా అవి పేలలేదు. వెంటనే స్పందించిన ఓ పోలీసు అధికారి వాటిరి మరమ్మత్తు చేసేందుకు ప్రయత్నించారు.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మంత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలోనే ఇది జరగడం గమనార్హం. ఈ ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో పోలీస్ అధికారులపై నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరమని.. తుపాకులు పనిచేయనప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచించనందుకు సుపౌల్ జిల్లా పోలీసు అధికారులను వివరణ కోరారు.