ముంబై: ప్రతి ఆర్థిక సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడం ప్రస్తుత మోదీ సర్కార్‌కు ఓ అలవాటై పోయిందని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఐదున్నరేళ్ల తర్వాత కూడా తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడమేమిటని నిలదీశారు.  ప్రధానిగా మన్మోహన్‌, ఆర్బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ ఉన్న సమయంలోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం అమెరికాలో వ్యాఖ్యానించారు. దేశంలో బ్యాంకింగ్ రంగ సంక్షోభానికి కారణం ఈ ఇరువురేనని ఆరోపించిన సంగతి విదితమే. 

గుణపాఠాలు నేర్చుకుంటే పరిష్కారాలు లభించేవి

ఈ నేపథ్యంలో గురువారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడుతూ ‘మా పాలనలో జరిగిన తప్పుల నుంచి మోదీ సర్కారు గుణపాఠాలు నేర్చుకుంటే బాగుండేది. ఇప్పుడు ఉన్న సమస్యలకు చక్కని పరిష్కారాలు దొరికేవి. నీరవ్ మోదీ, ఇతర రుణ ఎగవేతదారులు విదేశాలకు పారిపోయి ఉండేవారు కాదు. బ్యాంకుల పరిస్థితి మరింత దిగజారేది కాదు’ అని చురకలంటించారు.

ఐదున్నరేళ్లు చాల్లేదా..

గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడానికి ఐదున్నరేండ్లు చాల్లేదా?.. అని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని నిలదీశారు. ‘పదేళ్ల పాలనలో మేం అన్నీ తప్పులనే చేస్తే.. ఈ ఐదున్నరేళ్లలో మీరేం వెలగబెట్టారు’ అని ప్రశ్నించారు. ప్రజలకు చక్కని పాలనను అందించడానికి కావాల్సినంత సమయం ఈ ప్రభుత్వానికి లభించిందని, అయినా ఆ పని చేయకుండా.. గత ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ చౌకబారు ఆరోపణల్ని ఆపేసి, పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇంకా ఐదేళ్ల సమయం ఉన్న క్రమంలో లోపాలను గుర్తించి, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టి సారించాలి' అని సూచించారు. 

ఆ కల నెరవేరడం కల్ల

దేశ ఆర్థిక వ్యవస్థను 2024కల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న మోదీ సర్కార్ కల నెరవేరే అవకాశాలే లేవని మన్మోహన్ జోస్యం చెప్పారు. ఏటేటా వృద్ధిరేటు క్షీణిస్తూ పోతున్నదని, ఇలాంటి తరుణంలో అలాంటి లక్ష్యం ఎలా? సాధ్యమని ప్రశ్నించారు.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సరిగ్గా అంచనా వేయాలి
‘ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముందుగా దానిని సరిగ్గా అంచనావేసి, పరిష్కార మార్గాలను అన్వేషించాలి’ అని కేంద్రానికి సూచించారు. కేంద్రం చేసిన తప్పిదాల కారణంగా ఆయా రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత మహారాష్ట్రలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నదని తెలిపారు. 

ద్వంద్వ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు

బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని వివరించారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో రైతుల చావులు అధికమయ్యాయని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని అప్పుడే హెచ్చరించాననీ గుర్తుచేశారు. బీజేపీ అసమర్థ పాలన, సర్కారు ఉదాసీనత కారణంగా భవిష్యత్తు అంధకారమయ్యే అవకాశమున్నదని మన్మోహన్‌ హెచ్చరించారు.